Srinivas Goud on Shadnagar Incident : మహిళలకు కేవలం ఉచిత బస్సు ఇచ్చి సంతోషపడమంటే ఎలా అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మహిళలకు రక్షణ, ఆత్మ గౌరవం కావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు భయపడే పరిస్థితి ఉండేలా శాంతిభద్రతలు ఉన్నాయని, షాద్‌నగర్‌లో మహిళపై దాడి అతి దుర్మార్గమని ఆక్షేపించారు. యథా రాజా - తథా ప్రజ అన్నట్లు జరుగుతోందని మండిపడ్డారు. నేరం అంగీకరించాలని ఒక దళిత మహిళను పోలీసులే దారుణంగా హింసిస్తే ఎలా? ఇంకా ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు.
హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. నేరాల రేటు పెరిగితే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని, పర్యాటకులు ఎవరు వస్తారని అడిగారు. రాష్ట్రంలో దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, చెప్పుకోవడానికి సిగ్గు వేస్తోందని వ్యాఖ్యానించారు. జరుగుతున్న సంఘటనలు ప్రభుత్వ వైఫల్యంగానే చూస్తున్నామన్న ఆయన, ప్రభుత్వ విధానాలతో అందరూ బెదిరింపుల విషయంలో పోటీ పడుతున్నారని ఆరోపించారు.
షాద్‌నగర్‌లో మహిళపై పోలీసుల దాడి - తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ - Ktr Tweet On Dalit Woman Incident