Election Officials Stopped MLA Rachamallu Siva Prasad Reddy Campaign :సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రచారం మొదలుకొని పోలింగ్ తేదీ వరకు పార్టీలు, నేతలు ఈ నియామవళికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ వైఎస్సార్సీపీ నేతల తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు అయినట్లుగా కనిపించడం లేదు. కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో వైఎస్సార్సీపీ జెండాలు, నేతల ఫ్లెక్సీలు అలానే దర్శనమిస్తున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు బహుమతులు పంపీణీ చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ మొట్టికాయలు వేసి విచారణ జరిపించాలని చెప్పిన మరుసటి రోజే అనుమతి లేకుండా ప్రచారానికి వెళ్లడంతో అధికారులు అడ్డుకున్నారు.
Rachamallu Siva Prasad Reddy Violation of Election Code : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోనీ 38వ వార్డులో అనుమతి లేకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రచారం నిర్వహించారు. ఉదయం వార్డులో ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. దీంతో ఎన్నికల అధికారుల బృందం అక్కడికి చేరుకొని ప్రచారానికి అనుమతి లేదని నిలిపివేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం చేయాలంటే సువిధ యాప్లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అనుమతి తీసుకున్న తర్వాతే ప్రచారం చేయాలని చెప్పడంతో ప్రచారాన్ని నిలిపివేసిన రాచమల్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వైఎస్సార్సీపీ నేతలు - కేసు నమోదు
నా తప్పు లేదు : ఎన్నికల నియమావళిని తాను పాటిస్తానని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. సువిధ యాప్లో ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకునేందుకు తాము ప్రయత్నం చేశామని తెలిపారు. అయితే ఆ యాప్ పని చేయడం లేదని ఆరోపించారు. అనుమతి లేకపోవడంతో ప్రచారం నిలిపివేయాలని ఎన్నికల అధికారుల బృందం కోరడంతో తాను ప్రచారాన్ని నిలిపి వేశానని స్పష్టం చేశారు.
"సువిధ యాప్లో ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకునేందుకు రాత్రి ప్రయత్నం చేశాను. కానీ యాప్ ఓపెన్ కాలేదు. తప్పు వారిపై ఉన్న ప్రచారం ఆపమంటే ఆపేశాను."-రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే