Congress Leader Chinta Mohan on Madanapalle Fire Accident Case:మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో నిందితులు ఎంతటి వారైనా శిక్షించాలని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ డిమాండ్ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించిన చింతా మోహన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఫైళ్ల దహనం కేసులో విచారణ జరుగుతున్నందున ఎవరినీ అనుమతించట్లేదని చెప్పారు. దీంతో చింతా మోహన్ కార్యాలయం బయటే మీడియాతో మాట్లాడారు.
రెవెన్యూ వ్యవస్థను జగన్ పూర్తిగా భ్రష్టుపట్టించారని చింతా మోహన్ విమర్శించారు. అడంగల్ జమాబందీ వంటి విధానాన్ని పూర్తిగా తుడిచి పెట్టేశారని అన్నారు. రికార్డులను దహనం చేయడం తీవ్రమైన చర్యగా పరిగణించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు అభినందనీయమని అన్నారు. దీంతోపాటు పీసీబీలో జరిగిన రికార్డుల దహనం కేసుపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ కేసుల్లో నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కోరారు.