CM Jagan Siddham Meeting in Medarametla: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ వంటి జాతీయ స్థాయి నాయకులు పాల్గొనే సభలకూ ఇంత ఖర్చు చేయడం లేదంటే అతిశయోక్తి కాదు. వైసీపీ వంటి ఒక ప్రాంతీయ పార్టీ కేవలం నాలుగు సభలకే వందల కోట్లు ఖర్చు చేసిందంటే ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోంది? జగన్ సోదరి, పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల మాత్రమే కాదు ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు వేస్తున్న ప్రశ్న అదే. ఈ అయిదేళ్లలో ప్రభుత్వ పెద్దలు దోచుకున్న వేల కోట్లను ఇప్పుడు ఖర్చు పెడుతున్నారన్న విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆ సభలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
భారీ సెట్టింగ్‌లు, డెస్టినేషన్ వెడ్డింగ్‌ల పేరుతో అత్యంత ఆడంబరంగా చేస్తున్న పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల మాదిరిగానే వైసీపీ సిద్ధం సభలూ జరుగుతున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. సీఎం జగన్, వైసీపీ నేతలు కూర్చునేందుకు భారీ వేదిక, ప్రధాన వేదికపై నుంచి ప్రజల మధ్యకు జగన్ ర్యాంప్ వాక్ చేయడానికి వీలుగా దానికి అనుసంధానంగా 'వై' ఆకారంలో మరో వేదిక, వేల సంఖ్యలో ఫ్లెక్సీలు, పోస్టర్లు, ప్రాంగణమంతా నేలపై ఆకుపచ్చ తివాచీలు, వేదిక వరకు సీఎం కారు వెళ్లే మార్గంలోనూ కార్పెట్లు ఇలా ఎక్కడ చూసినా ఆడంబరం ఉట్టిపడేలా మేదరమెట్ల సిద్ధం సభ నిర్వహించారు. అంతకుముందు మూడు సిద్ధం సభలూ అదే స్థాయిలో జరిగాయి.
బెజవాడలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత అక్రమాలు- బూడిదతో సైతం కాసులు రాల్చుకునే ఘనుడు
సిద్ధం సభలతో సీఎం కొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. జనం మధ్యకు ర్యాంప్ వాక్ చేస్తున్నారు. మొదటి సభకు శిలువ ఆకారంలో ర్యాంప్ వాక్ వేదికను ఏర్పాటు చేశారు. దానిపై విమర్శలు రావడంతో ఇప్పుడు ఇంగ్లిషు అక్షరం 'వై' ఆకారంలోకి దాన్ని మార్చారు. మేదరమెట్ల సిద్ధం సభకు ప్రాంగణమంతా గ్రీన్ మ్యాట్ పరిచారు. ప్రస్తుతం సినిమాల చిత్రీకరణలో ఈ గ్రీన్ మ్యాట్ టెక్నిక్‌ను వాడుతున్నారు. గ్రీన్ మ్యాట్ ఉంచి స్టూడియోలోనే దృశ్యాలు చిత్రీకరిస్తారు. తర్వాత పర్వతాలు, జలపాతాలు వంటివి ఉన్నట్లుగా గ్రాఫిక్స్‌లో జతచేస్తారు. ఒక రాజకీయ పార్టీ సభకు గ్రీన్ మ్యాట్‌లు వేయడంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
సిద్ధం సభల కోసం వైసీపీ పదే పదే తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. వైసీపీ అనుబంధ విభాగాలుగా మారిపోయిన పోలీసు, ఆర్టీసీ తదితర విభాగాలు ఎక్కడలేని ప్రభుభక్తినీ ప్రదర్శిస్తూ సిద్ధం సభలకు ఏర్పాట్లలో తలమునకలవుతున్నాయి. వైసీపీ సభలు జరుగుతున్నాయంటే చాలు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు జీ హుజూర్ అంటూ ఎన్ని వేల బస్సులు కావాలంటే అన్నీ సమకూరుస్తున్నారు. వైసీపీ ఇప్పటి వరకు నిర్వహించిన నాలుగు సభలకు ఆర్టీసీ బస్సులకే సుమారు 22.50 కోట్లు ఖర్చు చేసింది.