CM Chandrababu Speech in NDA CMs Meeting : పది సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషి, చేపట్టిన కార్యక్రమాలతో భారతదేశం ఆర్థికంగా బలమైన శక్తిగా మారుతోందని సీఎం నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. కేంద్రం తీసుకు వచ్చిన కార్యక్రమాలతో ప్రపంచంలోనే 2, 3 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతోందని ప్రశంసించారు. నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచారనేందుకు హరియాణా ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు.
ఝార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఎన్డీఏ విజయం ఖాయమని చెప్పారు. చండీగఢ్‌లో గురువారం జరిగిన ఎన్డీఏ సీఎంల సమావేశంలో వికసిత్ భారత్ -2047 (Vikasit Bharat-2047)పై చర్చలో భాగంగా ఆత్మనిర్భర్ భారత్, మౌలిక సౌకర్యాల కల్పన, పేదరికం లేని సమాజం, పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన, తక్కువ రేటుకే విద్యుత్తు, రవాణా ఖర్చులు తగ్గించడం, నైపుణ్యమున్న మానవ వనరులు, జనాభా నిర్వహణ, నదుల అనుసంధానం, సాంకేతికత సమ్మేళనం తదితర అంశాలపై సీఎం మాట్లాడారు.
'దేశాభివృద్ధికి మా కూటమి కట్టుబడి ఉంది'- NDA సీఎంల సమావేశంలో ప్రధాని మోదీ
అందరం మోదీకి మద్దతుగా నిలబడదాం :దృఢమైన నిర్ణయాలు, సుపరిపాలన, మంచి రాజకీయాలు, ప్రత్యేక ఆకర్షణ, కమ్యూనికేషన్ తదితర అంశాలే ప్రధాని మోదీని విజయవంతమైన నేతగా నిలిపాయని, ఎంతో మంది ప్రధానులు వచ్చినా ప్రపంచంలో భారతదేశాన్ని ఇంతగా బ్రాండ్ చేసింది మోదీయే చంద్రబాబు కొనియాడారు. గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మోదీ ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదని గుర్తు చేశారు. ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం, ఆకాంక్షలను ఇది తెలియజేస్తుందని అన్నారు. కెప్టెన్‌గా మోదీ తన ఆలోచనతో వికసిత్ భారత్ - 2047 దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. అందరం మోదీకి మద్దతుగా నిలబడదాం, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని అడుగులు వేద్దామని సీఎం పిలుపునిచ్చారు.
డేటా ఎనలిటిక్స్, రోబోటిక్స్, ఏఐ వాడకం :ఓడరేవులు, విమానాశ్రయాలు, అంతర్గత జలమార్గాలు, లాజిస్టిక్ పార్కులు, రైల్వేలు, ఫ్రైట్ కారిడార్లు, ఎక్స్‌ప్రెస్ వేలు తదితర రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యంతో వేగవంతమైన ఫలితాలు సాధించొచ్చని చంద్రబాబు అన్నారు. నాణ్యమైన మౌలిక సౌకర్యాల కల్పన ద్వారా లాజిస్టిక్ ఖర్చులను 14% తగ్గించుకోవచ్చని చెప్పారు. మనకు ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులకు సాంకేతికతను జోడిస్తే ఇంధన రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చని, తద్వారా చమురు దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని తెలిపారు. డేటా ఎనలిటిక్స్, రోబోటిక్స్, ఏఐ వాడకం ద్వారా రోగనిర్ధారణ, ఆరోగ్య సేవల ఖర్చును భారీగా తగ్గించవచ్చని అన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సౌకర్యాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వాలు పని చేయాలని ఆయన సూచించారు.
"సమయం లేదు మిత్రమా" - ఏపీలో పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే!