AP Cabinet Meeting Decisions :ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఆర్థిక, ఆర్థికేతర అంశాలేవో చూసుకుని ఆర్థికేతర అంశాల అమలుపై వెంటనే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం మంత్రివర్గ సమావేశం ముగిశాక సహచర మంత్రులతో జరిగిన అంతర్గత భేటీలో వివిధ కీలక అంశాలు చర్చకువచ్చాయి. మంత్రులు తరచూ క్షేత్ర పర్యటనలకు వెళ్లాలని సూచించిన సీఎం అధికారిక వ్యవహారాల్లో కుటుంబసభ్యుల జోక్యం వద్దని హితబోధ చేశారు. ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో వైఎస్సార్సీపీ అదే పనిగా బురద జల్లుతోందని, దాన్ని గట్టిగా తిప్పి కొట్టాలని సీఎం సూచించారు.
మెగా డీఎస్సీ భర్తీకి ప్రక్రియ :ప్రభుత్వం బాగా పని చేస్తోందన్న భావన ప్రజల్లో ఉందని, దాన్ని సుస్థిర పరుచుకునేందుకు మరింతగా శ్రమించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు, వాటి వల్ల వస్తున్న ఫలితాలు, ప్రజలకు జరుగుతున్న మేలు స్పష్టంగా కనిపించాలన్నారు. మంత్రులు వారి శాఖలపై వీలైనంత త్వరగా పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎన్నికల హామీలన్నీ ఒక్కొకటిగా అమలు చేస్తున్నామని, మెగా డీఎస్సీ భర్తీకి ప్రక్రియ, నైపుణ్య గణన జరుగుతోందని మంత్రి నారా లోకేశ్ అన్నట్లు సమాచారం.
అక్రమాలకు బాధ్యులెవరో నిగ్గు తేల్చాలి :వైఎస్సార్సీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు చేసిన భూకబ్జాలు, అక్రమాలు, వారికి సహకరించిన అధికారులపై లోతైన విచారణ అవసరమని సమావేశంలో చర్చ జరిగింది. ఆయా శాఖల్లో పని చేస్తున్న అధికారులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడానికి అక్రమాల్లో వారి ప్రమేయం కూడా ఉండటమే కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. వాటిని మరింత లోతుగా తరచిచూసి, వాస్తవాల్ని బైటపెట్టేందుకు ప్రత్యేక కమిటీలు వేయాలని, క్షేత్రస్థాయి నుంచి సమగ్ర వివరాలు తెప్పించుకొని అక్రమాలకు బాధ్యులెవరో నిగ్గు తేల్చాలని నిర్ణయించారు. ప్రభుత్వంలో ఉండి ఊహాగానాలతో మాట్లాడటం సరికాదని బాధ్యులపై అన్ని ఆధారాలతో చర్యలు తీసుకుందామని సీఎం చంద్రబాబు హితబోధ చేసినట్లు సమాచారం.