CM Chandrababu Naidu Delhi Tour: ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై దాదాపు గంటపాటు ఆయన ప్రధానికి వివరించారు. ఇటీవల భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయగా, బుడమేరు పొంగి విజయవాడను ముంచెత్తింది. బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చిన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయిన సీఎం చంద్రబాబు వరదలకు నష్టపోయిన రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభించాలని, మరో సీజన్ నష్టపోకుండా నవంబర్‌లో వరద తగ్గుముఖం పట్టగానే కొత్త డయాఫ్రంవాల్ నిర్మాణ పనులు ప్రారంభించి వేసవి కల్లా పూర్తిచేసేలా సహకరించాలని చంద్రబాబు ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
Chandrababu Tweet: ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని కలవడంపై సీఎం చంద్రబాబు 'ఎక్స్'లో స్పందించారు. ప్రధాని మోదీతో ఫలవంతంగా చర్చలు జరిగాయని తెలిపారు. పోలవరం రివైజ్డ్ వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరించానన్న సీఎం, ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొనే విషయాల్లో కేంద్ర మద్దతు ఉందన్నారు. అమరావతికి ప్రధాని మద్దతును అభినందిస్తున్నానని సీఎం పేర్కొన్నారు.
ప్రధానితో సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు తన అధికార నివాసానికి వెళ్లిపోయారు. అక్కడ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్ర ప్రాజెక్టులకు పెండింగ్ నిధులు మంజూరుతోపాటు విశాఖ రైల్వే జోన్ పురోగతిపైనా కేంద్రమంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. అమరావతికి అనుసంధానమయ్యే రైల్వే ప్రాజెక్టుల గురించి, రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి, అనుసంధానంపైనా కేంద్రమంత్రితో భేటీలో చంద్రబాబు వివరించినట్లు సమాచారం.