CM Chandrababu Comments on Jagan :అధికారంలో ఉన్నప్పుడు రెడ్ కార్పెట్‌పై వెళ్లి జగన్ నష్టాన్ని పరిశీలించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు తాను బురదలో తిరుగుతున్నాను కాబట్టి ఆయన బురదలో దిగారని దుయ్యబట్టారు. తాను బురదలో దిగకపోతే అధికారులు దిగుతారా? వారిని వెళ్లమనే హక్కు నాకుంటుందా? అప్పుడు ప్రజల పరిస్థితేంటి? వారి దగ్గరకు వెళ్లేదెవరు? అని చంద్రబాబు తెలిపారు.
"గతంలో వరదలు వచ్చినప్పుడు జగన్ పట్టించుకున్నారా. నేను వెళ్లాను కనుకే అధికారులు వేగంగా స్పందించారు. నదికి వాగుకి తేడా తెలియనివాడు నా పనితీరును విమర్శిస్తాడా. బుడమేరు ఎక్కడ ఉంది నా ఇల్లు ఎక్కడ ఉంది. నా ఇల్లు మునిగిపోతుందని బుడమేరు గేట్లు ఎత్తానని అంటున్నారు. అబద్ధం చెప్పినా నమ్మేలా ఉండాలి. జగన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టం. విలాస వంతమైన జీవితానికి అలవాటు పడ్డ చేతగాని వ్యక్తి జగన్. అలాంటి వారికి ప్రజల కష్టాలు తెలియవు. జగన్‌కు పని లేదు కాబట్టే లండన్ వెళ్తున్నాడు." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
వాగుకు, నదికి తేడా తెలియని వ్యక్తి జగన్ :ముఖ్యమంత్రి పనిచేయాల్సిన అవసరం లేదని పని చేయకుంటే అన్నీ అయిపోతాయని జగన్ సమర్థించుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. ఆయనో సైకో అని ధ్వజమెత్తారు. తాను చెప్పేదే సరైందని నమ్మిస్తారని ఆక్షేపించారు. జనానికి ముద్దులు పెట్టి, ఇంట్లోకి వెళ్లాక పదిసార్లు చేతులు కడుక్కునే జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాలకు అనర్హులని దుయ్యబట్టారు. టమోటాకు పొటాటోకు నదికి వాగుకు తేడా తెలియని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. జగన్‌కు తెలిసిందల్లా సాయంత్రానికి గల్లాపెట్టె దగ్గర కూర్చుని ఎంత వసూలైందో చూసుకోవడమేనని చంద్రబాబు వ్యంగాస్త్రాలు సంధించారు.