Vizag Local Bodies MLC By Poll 2024 : ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా? అభ్యర్థి ఎవరు అన్న విషయాల్లో సందిగ్ధత కొనసాగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటాయి ? స్థానిక సంస్థల ప్రతినిధుల్లో ఎంత మంది తమవైపు మొగ్గు చూపుతారు వంటి అంశాలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
NDA Alliance Candidate Vizag MLC By Elections : ఎమ్మెల్సీ స్థానానికి పోటీపై జిల్లా ఎమ్మెల్యేలు, నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వైఎస్సార్సీపీ తరపున గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కొందరు తెలిపారు. మొదటి 11 నెలలు తప్ప, ఆ తర్వాత వారికి గౌరవ వేతనం కూడా ఇవ్వలేదని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది కూటమి పార్టీలవైపు మొగ్గు చూపుతున్నారని వివరించారు.
ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచేందుకు అవసరమైనన్ని ఓట్లు కూడగట్టగలమని కొందరు భరోసా వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం పోటీకి దూరంగా ఉండటం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చేముందు మరింత లోతుగా అన్ని అంశాల్ని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు ఆరుగురితో కమిటీని వేశారు. తెలుగుదేశం నుంచి పల్లా శ్రీనివాస్, బండారు సత్యనారాయణమూర్తి, వంగలపూడి అనిత, గంటా శ్రీనివాసరావు, జనసేన నుంచి పంచకర్ల రమేశ్‌బాబు, బీజేపీ నుంచి విష్ణుకుమార్‌రాజులను కమిటీలో నియమించారు. వారు మిగతా నేతలతోనూ చర్చించి తమ అభిప్రాయాన్ని చంద్రబాబుకి తెలియజేస్తారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.