CM Chandrababu on Haryana and JK Election Results:హర్యానాలో మూడోసారి బీజేపీ గెలవడం కేంద్ర సుపరిపాలనకు నిదర్శనమని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్ని అపోహలు, ప్రచారాలు జరిగినా హర్యానాలో ఎన్డీఏ గెలవడం మంచి పరిపాలనపై నమ్మకంతోనే అని స్పష్టం చేశారు. ఉదయం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి అభినందనలు తెలిపానన్నారు. జమ్మూ కశ్మీర్లో బలమైన పార్టీగా బీజేపీ అవతరించిందని అన్నారు. చెప్పే విధానం సరిగ్గా ఉండి, చేసేది మంచైనప్పుడు ఇలాంటి ఫలితాలే వస్తాయని వెల్లడించారు. మహారాష్ట్ర, జార్ఖండ్లలో త్వరలో జరిగే ఎన్నికల్లో కూడా ఈ తరహా ఫలితాలే వస్తాయని విశ్వసిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
జమిలి ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలిపాలని సీఎం చంద్రబాబు కోరారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానం వల్ల ప్రజలకు, రాష్ట్రాలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. త్వరలోనే భారతదేశం 3వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాకుండా దేశంలో 7 శాతం వృద్ధి రేటు ఉందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అందువల్ల వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు. పీపీపీ విధానంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు. సుస్థిరమైన పాలన ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు.
కాసులు కురిపిస్తున్న టమాటా - అప్పులు తీరిపోతాయని అన్నదాతల ఆనందం