BRS MLAs Protest in Telangana Assembly :తెలంగాణ శాసనసభలో భూభారతి బిల్లు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఫార్ములా-ఈ కేసు అసెంబ్లీని కుదిపేసింది. ఉభయసభల్లోనూ బీఆర్ఎస్ సభ్యులు చర్చకు డిమాండ్ చేయడంతో గందరగోళం నెలకొంది. అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలతో హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, గ్యారెంటీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని నినాదాలు చేశారు. ఫార్మలా- ఈ రేసుపై అసెంబ్లీలో చర్చించాలని లేకుంటే సభ జరగనివ్వమన్నారు. సభలో సమాధానం చెప్పేందుకు కేటీఆర్ సిద్ధమని తెలిపారు. ఫార్ములా ఈ-రేస్ కేసు అంశం ఒక వ్యక్తికి సంబంధించిన అంశమని, బిల్లు అనేది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశమని స్పీకర్ పేర్కొన్నారు.
అయినప్పటికీ చర్చించాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన చేపట్టారు. ఫార్మలా- ఈ అసెంబ్లీలో చర్చించటానికి ప్రభుత్వానికి భయమెందుకని నిలదీశారు. స్పీకర్ పార్టీ నేతగా వ్యవహరించొద్దని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో భూ భారతి బిల్లుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చ ప్రారంభించారు. అప్పటికే నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రి మాట్లాడుతున్నంత సేపూ అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించగా వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. అయినా వెల్‌లోకి దూసుకెళ్లిన హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ సభ్యులు.. స్పీకర్ పొడియం ముందు ఆందోళనకు దిగారు. మార్షల్స్ అడ్డుకునే ప్రయత్నం చేసినా తోసుకుంటూ మందుకెళ్లే ప్రయత్నం చేశారు.
స్పీకర్ పట్ల కూడా దారుణంగా వ్యవహరించారు : ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చింపివేసి సభాపతి స్థానం వైపు విసిరారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో శాసనసభను పదిహేను నిమిషాల పాటు సభాపతి వాయిదా వేయగా తిరిగి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ క్రమంలో సభను ఆర్డర్‌లో పెట్టాలని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఆందోళన చేసిన సభ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు.