TDP Formation Day Celebrations : 'సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు' అనే నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ ఇవాళ 42వ వసంతంలోకి అడుగు పెట్టింది. తెలుగు జాతి కీర్తి పతాకాల్ని- తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎగరేసిన ఈ పార్టీ, 'తెలుగు దేశం పిలుస్తోంది, రా కదలిరా' అంటూ అన్న నందమూరి తారకరామారావు పిలుపుతో 1982 మార్చి 29వ తేదీన పురుడు పోసుకుంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకూ, సవాళ్లూ, సంక్షోభాలకు కేంద్ర బిందువుగా నిలిచింది.
రాజకీయ పార్టీల ఎత్తుగడల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, సవాళ్లను సమర్థంగా అధిగమిస్తూ, ఎన్ని ఇబ్బందులు తలెత్తినా పోరాట పంథానే కొనసాగిస్తోంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్యే, ప్రజలతోనే మమేకమవటం తెలుగుదేశం పంథా. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి నవ్యాంధ్రలో తిరిగి అధికారం చేజిక్కించుకునే దిశగా తెలుగుదేశం పావులు కదుపుతోంది.
తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి మహాశయుల స్ఫూర్తిగా 1982లో ఇదే రోజున ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారనిచంద్రబాబు గుర్తు చేశారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారని ఆయన కొనియాడారు.