BRS Announced Chevella and Warangal MP Candidates : పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని మరో నలుగు స్థానాలకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించింది. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్(Kasani Gnaneshwar), వరంగల్ నుంచి కడియం శ్రీహరి కుమార్తె కావ్య, జహీరాబాద్ నుంచి అనిల్‌కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్లను బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ లోక్‌సభ పరిధిలోని నేతలతో సమావేశం అనంతరం అభ్యర్థిత్వాలను ఖరారు చేసి ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది: కేసీఆర్
రెండు చోట్లా గులాబీ పార్టీకి సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్‌కు అవకాశం ఇచ్చారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్(MP Pasunuri Dayakar) రెండు దఫాలుగా ప్రాతినిధ్యం వహించారు. మరోమారు పోటీకి సిద్దమన్న ఆయన, అవకాశం ఇవ్వకపోయినా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కడియం కావ్య పేరును ఖరారు చేశారు.
BRS MP Candidates 2024 :ఇప్పటికే ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్, తాజా ప్రకటనతో మొత్తం తొమ్మిది అభ్యర్థిత్వాలు ప్రకటించినట్లైంది. కాగా తొలి జాబితా వివరాలు గమనిస్తే కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఎంపీ వినోద్‌కుమార్, పెద్దపల్లి(SC Reserve) స్థానం నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్(ఎస్టీ రిజర్వ్) నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి(Manne Srinivas Reddy) బరిలో ఉన్నారు.