జూన్ 2నాటికి తెలంగాణకు పదేళ్లు- స్వాధీనం చేసుకోవాల్సిన భవనాలపై రేవంత్ సర్కార్ ఫోకస్ (ETV Bharat) Bifurcation Building Issue Between AP and Telangana:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై జూన్ రెండో తేదీతో పదేళ్లు పూర్తవుతుంది. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ నగరం పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా అక్కడకు తరలిన తర్వాత హైదరాబాద్‌లో ఆ రాష్ట్ర అవసరాల కోసం కొన్ని భవనాలను కేటాయించారు. రాజ్‌భవన్ రోడ్‌లో ఉన్న లేక్‌వ్యూ అతిథిగృహం, లక్డీకాపుల్‌లో పోలీసు విభాగానికి చెందిన సీఐడీ భవనంతో పాటు ఆదర్శనగర్‌లోని హెర్మిటేజ్ కాంప్లెక్స్‌ను ఏపీ అవసరాల కోసం కేటాయించారు.
ఇప్పటి వరకు ఆ భవనాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. ఆ రాష్ట్ర కార్యకలాపాల కోసం వాటిని వినియోగిస్తున్నారు. మంత్రులు, ఇతరులు, అధికారులు, ఇతరత్రా అవసరాల కోసం వాడుతున్నారు. జూన్ రెండో తేదీతో పదేళ్ల కాలం పూర్తవుతున్నందున ఉమ్మడి రాజధాని అన్న అంశం ఉండదు. దీంతో ఆ భవనాలన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులకు తెలిపారు.
జూన్ 2తో ముగియనున్న ఉమ్మడి రాజధాని కాలపరిమితి - అపరిష్కృత విభజన అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్ ఫోకస్ - Revanth Reddy on Bifurcation Issues
కొనసాగించాలని కోరిన ఆంధ్రప్రదేశ్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఆ భవనాలను కొన్నాళ్ల పాటు తమకే కొనసాగించాలని తెలంగాణను కోరింది. ఈ మేరకు ఏపీ నుంచి గతంలోనే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి వచ్చింది. దానిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా కమిషన్ కార్యాలయాన్ని ఇటీవలే కర్నూలుకు తరలించారు. ఏపీ ఆధీనంలో ఉన్న మూడు భవనాల్లో పోలీసు శాఖ తప్ప మిగతా వాటిని పెద్దగా వినియోగించుకోవడం లేదనే చెప్పవచ్చు.
విభజన అంశాలపై తెలంగాణ సర్కార్ నజర్ - ఆ అంశాలపై రేపటి కేబినెట్ భేటీలో కీలక చర్చ! - Bifurcation Issues Of Ts And Ap
వాస్తవానికి భవనాల స్వాధీనం సహా విభజన అంశాలపై మంత్రివర్గంలో చర్చించాలని సీఎమ్ రేవంత్ రెడ్డి మొదట భావించారు. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో ఉమ్మడి రాజధాని అంశంపై కేబినెట్‌లో చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ అంశం పెండింగ్‌లో పడింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. లేక్ వ్యూ అతిథి గృహం అవసరం చాలా ఉందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
ప్రభుత్వ అతిథులు, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హైదరాబాద్ వస్తే ప్రస్తుతం సరైన వసతి లేదని, హోటళ్లలో వసతి కల్పించాల్సి వస్తోందని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దిల్‌కుషా, మంజీరా అతిథి గృహాలు ఉన్నప్పటికీ అవి సరిగ్గా లేవని అంటున్నారు. లేక్ వ్యూ అతిథి గృహం అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వ అతిథులుగా తగ్గట్లుగా ఉంటుందని చెప్తున్నారు. విడిదితో పాటు సమావేశాల నిర్వహణకు కూడా అనువుగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చేతిలోకి వస్తే హెర్మిటేజ్ కాంప్లెక్స్, సీఐడీ కార్యాలయంలోకి కూడా వివిధ కార్యాలయాలను తరలించుకోవచ్చని చెప్తున్నారు.
చంద్రబాబుపై కేసీఆర్‌కు అసూయ, ద్వేషం - ఏపీ రాజకీయాలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు - Revanth Reddy on AP Politics