ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

జగన్‌ మాటల్లోనే 'నా' చేతల్లో 'నో'- సొంత సామాజికవర్గానికే మరోసారి పెద్దపీట

Allegations on YSRCP Candidates List: నా ఎస్సీ, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ జగన్‌ పలికే మాటలన్నీ ప్రాచారానికే పరిమితమయ్యాయి. అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థిత్వాలకు వచ్చేసరికి తన సొంత సామాజికవర్గమే తనకు అత్యంత ప్రాధాన్యమని ఆయన నిరూపించుకున్నారు. 49 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలను సొంతవారికే కట్టబెట్టారు.

Allegations_on_YSRCP_Candidates_List
Allegations_on_YSRCP_Candidates_List

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 7:43 AM IST

Allegations on YSRCP Candidates List: నా ఎస్సీ, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పిందే చెబుతూ నిత్యం అసత్యాలను జపించే ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల కేటాయింపుల్లో మాత్రం 'నా'వర్గానికే ప్రాధాన్యమని తేల్చేశారు. మొదటినుంచీ పార్టీలో, ఐదేళ్లుగా ప్రభుత్వంలో అగ్రతాంబూలం అందుకుంటున్న తన సొంత సామాజిక వర్గానికే మరోసారి పెద్దపీట వేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 49, ప్రకటించిన 24 లోక్‌సభ స్థానాల్లో ఐదు చోట్ల తన సొంత సామాజిక వర్గం వారికే సీట్లు కట్టబెట్టారు.

ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో సగటున 80 శాతానికిపైగా సీట్లలో తనవారికే పోటీ చేసే అవకాశమిస్తూ 'నా'వాళ్లంటే నా సామాజిక వర్గమేనని తేల్చి చెప్పారు. తాను నిత్యం ప్రవచించే సామాజిక న్యాయానికి ఇడుపులపాయ ఎస్టేట్‌ సాక్షిగా సమాధి కట్టారు. ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వుడు స్థానాలు మినహా ఒక్కటీ అదనంగా ఇవ్వలేదు. 25 మంది సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించారు. 15 మందిని బదిలీచేశారు. ఆరుగురు సిట్టింగుల స్థానంలో వారసులకు అవకాశమిచ్చారు. ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయించనున్నారు. తొలిసారి అసెంబ్లీకి పోటీచేసే అవకాశం 46 మందికి దక్కింది.

ఆంధ్రప్రదేశ్​లో మే 13న పోలింగ్- జూన్ 4న ఫలితాలు

సీమ జిల్లాల్లో వైసీపీ తరఫున పోటీ చేసే అర్హత మరెవరికీ లేదనుకున్నారో, ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారో మరి, ఎక్కువ సీట్లను సొంత సామాజికవర్గానికే ఇచ్చారు. ఉమ్మడి కడప జిల్లాలో జనరల్‌ సీట్లు 8 ఉంటే అందులో 7 చోట్ల తన సామాజిక వర్గీయులనే బరిలో నిలిపారు. ఇది 87శాతం పైనే. బడుగుల జిల్లా అనంతపురంలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 12 జనరల్‌ సీట్లున్నాయి. ఇందులో 8 సీట్లను సీఎం సొంత సామాజికవర్గం వారికి కేటాయించారు.

మరో రెండు చోట్ల అభ్యర్థుల భర్తలు, జగన్‌ సామాజికవర్గం వారే. అయితే ఆ మహిళలిద్దరికీ బీసీల కోటాలో ఇచ్చినట్లు లెక్కలో చూపించారు. మొత్తంగా 12 జనరల్‌ స్థానాల్లో 10 సీట్లు అంటే 83% సొంత సామాజికవర్గానికే. ఉమ్మడి కర్నూలులో 12 జనరల్‌ సీట్లలో 9 చోట్ల సీఎం జగన్‌ సొంత సామాజిక వర్గానికే సీట్లు కేటాయించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 11 జనరల్‌ సీట్లలో 8 చోట్ల తన సామాజిక వర్గీయులనే బరిలో నిలిపారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్- వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనే వీల్లేదు : CEO

మొత్తంగా 50 శాతం సీట్లలో మార్పులు చేశామని సీఎం జగన్‌ గర్వంగా చెప్పారు. అయితే ఆయన చెప్పిన 50 శాతం మార్పుల్లో 90 శాతానికిపైగా బడుగుల సీట్లలో చేసినవే. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా వైసీపీ పలు స్థానాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలను బదిలీ చేసింది. తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం నుంచి సమన్వయకర్తల పేరుతో మరో నియోజకవర్గానికి పంపింది. ఇందులో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలవారే. గత ఎన్నికల్లో లోక్‌సభకు పోటీచేసిన వారిలో 18 మందిని వైసీపీ మార్చింది. 2019 ఎన్నికల్లో మొత్తం 22 మంది గెలుపొందగా వారిలో ఏడుగురికి మాత్రమే మళ్లీ టికెట్లు దక్కాయి. లోక్‌సభకు సరైన అభ్యర్థులు దొరక్కపోవడంతో ఉన్నవారితోనే సరిపెట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details