Murder of a young man in Bapatla District : ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే బాపట్ల పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఓ యువకుడి హత్యకు దారి తీసింది. నిత్యం రద్దీగా ఉండే బాపట్ల సూర్యలంక రహదారిపై రక్తం ధారలై పారింది. ఏం జరుగుతుందో అని స్థానికులు తెలుసుకునే లోపల మారణాయుధాలతో పదుల సంఖ్యలో వచ్చిన యువకులు ఇద్దరిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఓ యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేశారు. పట్టణ శివారు కనకాద్రి నగర్ లో ఓ రెస్టారెంట్ సమీపంలో జరిగిన ఘటనలో గోరంట్ల వెంకట సుమంత్ (25) మంగళవారం రాత్రి ( ఫిబ్రవరి 6) ప్రాణాలు కోల్పోయాడు.
రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ విలనే! తహసీల్దారు హత్య కేసులో సంచలన విషయాలు
పట్టణంలో పెయింటర్స్ కాలనీకి చెందిన వెంకట సుమంత్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ కోర్సు చేస్తున్నాడు. మంగళవారం ఉదయమే సొంతూరు వచ్చాడు. స్నేహితులు సోను, రాహుల్, మరో ఇద్దరితో కలసి పట్టణంలో కారులో తిరుగుతూ మద్యం తాగారు. మధ్యాహ్న సమయంలో చీల్ రోడ్డు ప్రాంతంలో ఓవర్గం యువకులతో గొడవపడిన వీరు కత్తులు తీసి బెదిరించినట్లు తెలిసింది. రాత్రి 7 గంటల సమయంలో పట్టణ శివారు కనకాద్రి నగర్ సమీపంలో ఓ రెస్టారెంట్లో తినేందుకు వచ్చారు. తనను కత్తులతో బెదిరిస్తారా? అని వీరిని వెతుక్కుంటూ మరో వర్గానికి చెందిన 30 మంది యువకులు మారణాయుధాలతో ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో వచ్చారు. రాహులు, సోను బృందం వచ్చిన కారు రెస్టారెంట్ సమీపంలో ఉండటం గమనించి సిమెంటు రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. వీరి ఆచూకీ సిబ్బందిని అడిగారు. అప్పటికే లోపల ఉన్న రాహుల్ బృందాన్ని వెంటనే వెళ్లి పోవాలని సిబ్బంది హెచ్చరించారు. సోను, వెంకట సుమంత్, రాహుల్ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి సూర్యలంక రోడ్డులో యువకులకు కనిపించారు.
తహసీల్దార్ రమణయ్య హత్య కేసు - నిందితుడు సుబ్రమణ్యం అరెస్ట్
విచక్షణ రహితంగా కత్తులతో దాడి :వారు ముగ్గురు కనిపించిన వెంటనే మరో వర్గం యువకులు దాడికి తెగబడ్డారు. సోను పరిగెత్తి తప్పించుకోగా తమకు చిక్కిన సుమంతు, రాహులను కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్ర గాయాలైన సుమంతు రోడ్డు పక్కనే పడి మృతి చెందగా, తన వద్ద ఉన్న కత్తితో రాహుల్ ఎదురు దాడికి దిగి గాయపడ్డాడు. వెంటనే చేరాల ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొంది పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చేరుకున్నారు. సుమంత్ మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రి మార్చరికి పోలీసులు తరలించారు. జీవితంలో స్థిరపడాలని హైదరాబాద్ వెళ్లి స్టాప్ట్‌వేర్ శిక్షణ తీసుకుంటున్న తమ కుమారుడు స్నేహితులతో తిరుగుతూ మృతి చెందడాన్ని చూసిన సుమంత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.