White Hair Problem in Children :వయసు పైబడే కొద్దీ తెల్లవెంట్రుకలు రావడం సహజం. కానీ ఇది ఒకప్పటి మాట! ప్రస్తుతం చిన్న పిల్లలకి కూడా జుట్టు నెరిసిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఒకరకంగా చెప్పాలంటే- పిల్లల్లో ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు సర్వసాధారణమైపోయిందన్నా ఆశ్చర్యం లేదు. దీనికి పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యంతో పాటు ఇంకా చాలా రకాల కారణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు. ఫలితంగా చిన్నతనంలోనే పిల్లల వయసు ఎక్కువగా కనిపించి క్రమంగా వారిలో ఆత్మన్యూనతా భావం కలిగే అవకాశమూ లేకపోలేదు. అయితే, ఈ సమస్య నుంచి పిల్లల్ని బయటపడేసే మార్గం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సమస్యలున్నాయేమో!
- పిల్లల్లో జుట్టు త్వరగా నెరిసిపోవడానికి వారు ఎదుర్కొనే కొన్ని రకాల సమస్యలే కారణం అంటున్నారు నిపుణులు. అవేంటంటే-
- పిల్లలు చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? ఎందుకంటే చుండ్రు జుట్టును నిర్జీవం చేసి ఫాస్ట్‌గా తెల్లబడేలా చేస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి ఒకవేళ పిల్లల్లో ఈ సమస్య ఉన్నట్లయితే వెంటనే వైద్యుల సలహా మేరకు తగిన మందులు వాడి చుండ్రును వీలైనంత త్వరగా తగ్గించుకోవడం మంచిది.
- నార్మల్‌గా కొన్ని సమస్యలు వంశపారంపర్యంగా రావడం మనం గమనిస్తూనే ఉంటాం. వాటిలో జుట్టు తెల్ల రంగులోకి మారడం కూడా ఒకటి. పిల్లల తల్లిదండ్రులకో, వారి తాతముత్తాతలకో ఈ సమస్య ఉంటే వారికి కూడా చిన్నతనంలోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది.
- విటమిన్ బి12 లోపం, అనీమియా, థైరాయిడ్, ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లల్లోనూ తెల్లవెంట్రుకలు వచ్చే అవకాశం ఉంటుంది.
"కుటుంబంలో ఎవరికైనా తెల్ల జుట్టు ఉంటే చిన్నవయసులోనే పిల్లల్లో ఈ సమస్య కనిపిస్తుంది. అలాగే ఆహారపు అలవాట్లు, విటమిన్ బి12 లోపం, రక్తం తక్కువగా ఉండడం, థైరాయిడ్ ఎక్కువగా లేదా తక్కువగా ఉండడం వంటివి జుట్టు నెరసిపోవడానికి ప్రధాన కారణాలు."- డాక్టర్ దీప్తి వాల్వేకర్ (కాస్మొటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్)
నేచురల్‌గా!
చిన్నారుల్లో తెల్లజుట్టు నివారణకు కొన్ని సులభమైన, సహజసిద్ధమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు నిపుణులు. అవి మీ కోసం
- బాదం నూనె, ఉసిరి నూనె ఈ రెండింటినీ సమపాళ్లలో తీసుకొని నైట్ పడుకొనే ముందు పిల్లల జుట్టు మొదళ్లలో బాగా మర్దన చేయాలి. అలాగే నైట్ మొత్తం ఉండనిచ్చి ఉదయాన్నే శుభ్రంగా తలస్నానం చేయించాలి.
- తెల్లజుట్టు సమస్యను తగ్గించడంలో కరివేపాకు చక్కగా పనిచేస్తుంది. జుట్టుకు పెట్టుకొనే నూనెలో కరివేపాకు వేసి కాసేపు బాగా మరిగించాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇలా తయారైన నూనెను జుట్టుకు తరచూ అప్లై చేసుకోవాలి. ఫలితంగా కొన్ని రోజులకు తెల్లజుట్టు సమస్య తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంటుంది.
- కలబంద గుజ్జు కూడా పిల్లల్లో తెల్లవెంట్రుకల్ని నిర్మూలించడంలో సహాయడుతుంది.
- ఐరన్, విటమిన్ బి, సోడియం, కాపర్, ఫోలికామ్లం వంటివి అధికంగా ఉండే ఆహారంతో పాటు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయల్ని పిల్లలకు ఎక్కువగా అందించాలి.
- డైలీ పిల్లలతో ఒక గ్లాసు క్యారట్ రసం తాగించినట్లయితే కేవలం తెల్లజుట్టే కాదు- చుండ్రు, జుట్టు రాలే సమస్యలు కూడా క్రమంగా తగ్గిపోతాయి.
- అలాగే చిన్నారులకు పదే పదే తలస్నానం చేయించడం, గాఢత ఎక్కువగా ఉండే షాంపూలు వాడడం వంటివి ఎంత తగ్గిస్తే అంత మంచిది.
చిన్న వయసులోనే పిల్లల్లో తెల్లజుట్టు రావడానికి గల కారణాలు, వాటికి తగిన పరిష్కార మార్గాలేంటో తెలుసుకున్నారు కదా! ఇవన్నీ సహజసిద్ధమైనవే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు. కానీ ఇవన్నీ వాడిన తర్వాత కూడా ఎలాంటి మార్పూ కనిపించకపోతే ఆలస్యం చేయకుండా సంబంధిత డాక్టర్ని సంప్రదించి తగిన సలహాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కర్రీ మాడిపోయిందా? - ఈ చిట్కా పాటిస్తే వాసన ఇట్టే పోతుంది!
పిల్లలకు రైమ్స్, కార్టూన్స్ పెట్టి ఇస్తున్నారా? ఇలా చేస్తే అనేక సమస్యలు వస్తాయట జాగ్రత్త!