ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

రూ.40కోట్లు పలికిన 'నెల్లూరు ఆవు' - బహిరంగ వేలంలో ప్రపంచ రికార్డు - NELLORE BREED COW VIATINA 19

బ్రెజిల్ దేశంలో నెల్లూరు జాతి బ్రీడ్​కు భారీ డిమాండ్ - 150 ఏళ్ల కిందటే మన దగ్గర నుంచి ఎగుమతి

nellore_breed_cow_viatina_19
nellore_breed_cow_viatina_19 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2025, 10:54 AM IST

Nellore breed cow Viatina 19 :'ఇంట ఓడినా రచ్చగెలవడం' అంటే ఇదేనేమో! మనం దాదాపు మర్చిపోయిన నెల్లూరు జాతి(ఒంగోలు) పశువులు విదేశాల్లో బంగారమయ్యాయి. ఎంతో పేరెన్నిక ఒంగోలు జాతి ఆవు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. బహిరంగ వేలంలో దాదాపు 40కోట్ల రూపాయల ధర పలికి సరికొత్త రికార్డు లిఖించింది. 'ఒక్క ఆవుకే అన్ని కోట్లా!' అని ఆశ్చర్యపోతున్నారా? కానీ, వేలం జరిగింది ఇక్కడ కాదు, దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ దేశంలో. మన ఒంగోలు జాతి ఆవులు అక్కడెలా! అని ఆలోచిస్తున్నారా? దానికి పెద్ద చరిత్రే ఉంది. జెర్సీ, ఇతర జాతి ఆవులపై మోజుతో మనం మర్చిపోయిన ఒంగోలు జాతి పశువులు ప్రపంచంలోనే అత్యున్నత మేలు జాతిగా హవా కొనసాగిస్తున్నాయి.

వేలంలో అత్యధిక ధర పలికిన విటియానా ఆవు (వృత్తంలో నెల్లూరు జాతి కోడె) (ETV Bharat)

ఇదే అత్యధిక ధర

బ్రెజిల్‌లో 'వియాటినా-19' అనే నెల్లూరు (ఒంగోలు) జాతి మూలాలున్న ఆవు 4.8 మిలియన్ డాలర్ల ధర పలికింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.40కోట్లకుపైనే. ఇంత ధర పలకడం ఇదే తొలిసారి కావడంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా విటియానా -19 సరికొత్త రికార్డు లిఖించింది.

"ఒంగోలు గిత్త"కు 17లక్షల అప్పు - కడుపునిండా తిండి లేక మనుగడకే ముప్పు

బరువు, బలం ప్రత్యేకం

జన్యు లక్షణాలు, శరీర నిర్మాణం, సంతానోత్పత్తి పరంగా విటియానా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంది. దాదాపు వెయ్యి కిలోలకు పైగా ఉన్న విటియానా సాధారణ ఆవులతో పోలిస్తే బరువు, బలం అధికంగా ఉంటుంది. పశుపోషణ, ఉత్పత్తిలో బ్రెజిల్ దేశం ముందుండడంలో ఈ జాతిదే కీలక పాత్ర.

ప్రపంచ దేశాలు ఆసక్తి

పాడి ఉత్పత్తులు, పశు మాంసం ఎగుమతిలో అతిపెద్దదైన బ్రెజిల్ దేశం 'వియాటినా 19' అండాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వియాటినా 19 'మూ-జెనిక్స్' పద్ధతిలో జన్మించింది. సరోగసీ పద్ధతిలో ఆవులలో ప్రత్యేక పిండాలను క్లోనింగ్ చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ నేపథ్యంలో వియాటినా 19 ప్రీ-ఓవమ్ అండాల కొనుగోలుకు పలు దేశాలు పోటీ పడుతున్నాయి.

గుంటూరులో జాతీయస్థాయి ఎడ్ల పందేలు

రెండు ఆవులతో మొదలైన ప్రస్థానం

19వ శతాబ్దంలోనే నెల్లూరు (ఒంగోలు) జాతి పశువులు బ్రెజిల్ దేశానికి ఎగుమతి అయ్యాయి. 1868 సంవత్సరంలో ఓ ఓడ ఇండియా నుంచి విలువైన వస్తువులతో ఇంగ్లండ్ బయల్దేరి బ్రెజిల్ తీరానికి చేరింది. ఆ సమయంలో ఓడలో ఉన్నటువంటి రెండు నెల్లూరు జాతి పశువుల(కానుకలు)ను స్థానిక వ్యాపారులు కొనుగోలు చేశారు. దాంతో నాటి నుంచి బ్రెజిల్​లో నెల్లూరు జాతి పశు పోషణ ప్రారంభమైంది. నాటి నుంచి 1962లో భారత ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించే వరకూ లక్షలాది ఒంగోలు జాతి పశువులు తరలిపోయాయి. బ్రెజిల్ మాత్రమే కాదు అమెరికా, మెక్సికో, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, మారిషస్, కొలంబియా, మలేసియా ఇలా ఎన్నో దేశాలకు నెల్లూరు జాతి పశువులు ఎగుమతి అయ్యాయి.

ఎన్నో మేలు సుగుణాల కలయిక

ఎలాంటి వాతావరణంలో అయినా చక్కగా ఇమిడిపోవడం ఒంగోలు జాతి ఆవుల ప్రధాన లక్షణం. బ్రెజిల్​లోని విశాలమైన గడ్డి భూముల్లో ఇవి వేగంగా పెరిగాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువ కావడంతో పశుపోషణ, ఉత్పత్తి వేగం పుంజుకుంది. దేశ వ్యాప్తంగా పశువుల సంఖ్య దాదాపు 30కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో 80శాతం మేలురకం, సంకరజాతి ఒంగోలు పశువులే కావడం గమనార్హం. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరొందిన నెల్లూరు జాతి జన్మస్థానమైన మన దగ్గర మనుగడ కోసం పోరాడుతోంది.

ప్రాధాన్యం తగ్గిందిలా!

  • వ్యవసాయ యాంత్రీకరణ పెరగడంతో పశువుల అవసరం తగ్గిపోగా, ఆదరణ కరువైంది.
  • పొలాలకు ఎరువులుగా వాడిన పశువుల పేడ, మూత్రాల స్థానంలో రసాయనిక ఎరువుల వాడకం పెరిగింది.
  • పాల దిగుబడి అధికంగా ఇచ్చే గేదెలు ఆవుల స్థానాన్ని ఆక్రమించాయి.
  • ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటల సాగు పెరగడంతో పశుగ్రాసం లేకుండా పోయింది.

కుటుంబ సభ్యుల మాదిరిగా

ఒంగోలు జాతి గిత్తల పోషణ తగ్గిపోయినా ఇప్పటికీ వాటికి ఎంతో ఆదరణ ఉంది. సంక్రాంతి సంబరాలతో పాటు జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఎద్దుల పోటీల్లో అవి తమ సత్తాను చాటుతున్నాయి. చాలా మంది ఔత్సాహిక రైతులు ఒంగోలు గిత్తలను కుటుంబ సభ్యుల మాదిరిగా పెంచుకుంటున్నారు. ఖర్చు ఎక్కువైనా సరై వాటిపై తరగని ప్రేమ వారిని ఖర్చుకు వెనుకాడనివ్వడం లేదు. పందేల్లో విలువైన బహుమతులు గెలుచుకుని తమ యజమానులకు కానుకగా అందిస్తున్నాయి.

టీడీపీ హయాంలో సంరక్షణ దిశగా

మనకెంతో ప్రత్యేకమైన ఒంగోలు జాతి పశువుల సంరక్షణకు గత టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడలో పశు ఉత్పత్తి క్షేత్రాన్ని ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత 2014-19 మధ్య రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ నుంచి 6కోట్ల రూపాయలు మంజూరు కాగా పశువుల కోసం మౌలిక వసతులు, రేకుల షెడ్లు నిర్మించారు. వైఎస్సార్సీపీ హయాంలో నిర్వహణ భారంగా మారింది. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో పుట్టిన కోడె దూడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నా ఆదరణ ఉండడం లేదు. వ్యవసాయంలో పెరిగిన యాంత్రీకరణ ఫలితంగా ఎద్దుల పోషణ రైతులకు భారమైపోవడమే అందుకు కారణం. సరోగసీ విధానంలో జన్మించిన ఆవులు ఎక్కువ పాలు ఇస్తున్నాయని పోషకులు వెల్లడిస్తున్నారు.

పశు క్షేత్రంపై రూ.17లక్షల అప్పు

ఆవు నెయ్యికి ఎంతో డిమాండ్ ఉంది. పశుక్షేత్రంలో ఆవుల ఉత్పత్తిని స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులకు రాయితీపై పంపిణీ చేస్తే స్వయం ఉపాధితో పాటు ప్రపంచ స్థాయి ఒంగోలు జాతిని కాపాడినట్లవుతుంది. పశుక్షేత్ర నిర్వహణకు రూ.17 లక్షల అప్పు ఉందని, పశువుల సంరక్షణకు రూ.30 లక్షలు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అధికారులు వెల్లడించారు.

ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన- సంక్రాంతి సంబరాల్లో హుషారు

ABOUT THE AUTHOR

...view details