How to Carry Pet Dog in Indian Railways :చాలా మందికి కుక్కలంటే ఎంతో ఇష్టం. బుజ్జిబుజ్జీగా ఉండే చిన్న కుక్క పిల్లలను ప్రేమతో ఇంట్లో పెంచుకుంటారు. ఇక కొంతమంది తమ స్టేటస్‌ను తెలియజేయడానికి కూడా కుక్కలను పెంచుకోవడం మనం చూస్తుంటాం. కాస్త ఒత్తిడి, ఆందోళనగా అనిపించినప్పుడు కుక్కతో వాకింగ్‌కు వెళ్తే రిలాక్స్‌గా అనిపిస్తుందని చెబుతుంటారు వాటి యజమానులు. కొందరు విహారయాత్రలు, సొంతూళ్లకు వెళ్లినప్పుడు కుక్కలను తమతో పాటు కార్లలో తీసుకెళ్తుంటారు. అయితే, మీరు ట్రైన్లో కూడా పప్పీని మీ వెంట తీసుకెళ్లచ్చు. కానీ, మెజార్టీ జనాలకు ఈ విషయం తెలియదు! అయితే, కుక్కలను రైళ్లో ఎలా తీసుకెళ్లాలో ఇప్పుడు చూద్దాం.
- ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మీరు మీ వెంట పప్పీని తీసుకెళ్లడానికి టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. అయితే, మీరు AC ఫస్ట్ క్లాస్‌లో మాత్రమే కుక్కలను మీ వెంట తీసుకెళ్లవచ్చు. ఇందుకోసం ఫస్ట్ క్లాస్ ఏసీలో 2- బెర్త్ లేదా 4-బెర్త్ కూప్ మొత్తం రిజర్వ్ చేసుకోవాలి.
- AC 2 టైర్, AC 3 టైర్, ఏసీ చైర్ కార్ కోచ్‌లు, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ (జనరల్ బోగి) కోచ్‌లలో కుక్కలను తీసుకెళ్లడానికి అనుమతి లేదు.
- ప్యాసెంజర్ నేమ్ రికార్డ్ Passenger Name Record (PNR) ప్రకారం ఒక కుక్కకు మాత్రమే అనుమతి ఉంటుంది.
- మీ కుక్క తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్త వహించాలి. లేకుంటే పప్పీని గార్డ్ వ్యాన్‌కు తరలిస్తారు. అలాగే డబ్బును తిరిగి ఇవ్వరు.
- కుక్కకు సంబంధించిన మంచి నీరు, ఆహారం వంటి వాటిని యజమానులే వెంట తీసుకెళ్లాలి.
- మీరు ముందస్తుగా ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసుకోకపోతే ట్రైన్ బయలుదేరడానికి మూడు గంటల ముందు పార్శిల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. పార్శిల్ కార్యాలయంలోని సిబ్బంది మీ కుక్కను రైలులో తీసుకెళ్లడానికి కొన్ని వివరాలు అడుగుతారు. తర్వాత వారు అనుమతిస్తే మీకు టికెట్ జారీ చేస్తారు. ఆపై మీ కుక్కను రైలులో ఎలా తీసుకెళ్లాలో సూచనలు అందిస్తారు.
- అనుమతి లేకుండా కుక్కను రైలులో తీసుకెళ్లకూడదు. అలా వెళ్తే జరిమానా విధిస్తారు.
- కుక్కను రైలులో వెంట తీసుకెళ్లేవారు కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా క్యారీ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది వెటర్నరీ సర్టిఫికెట్ (Veterinary Certificate). కుక్క ఆరోగ్యంగా ఉందని, ఎలాంటి అంటు వ్యాధులు లేవని వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్‌ను జారీ చేయాలి. ఇది ప్రయాణానికి 24-48 గంటల ముందు తీసుకుంటే మంచిది.
- అలాగే మీ పప్పీకి వేసిన టీకాల వివరాలను తెలిపే టీకాల రికార్డును (Vaccination Records) కూడా వెంట ఉంచుకోవాలి.
- మీ కుక్క జాతి, రంగు, లింగం ఇతర వివరాలు తెలిపే గుర్తింపు పత్రం (ID Proof) ఉంటే మంచిది.