Gold Buying Tips in Telugu:పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఇంట్లో శుభకార్యం అనగానే ముందుగా మనందరికీ బంగారం గుర్తుకొస్తుంది. పేద, మధ్యతరగతి, సంపన్నులు ఇలా ఎవరింట్లో వేడుక జరిగినా వారి స్థాయికి తగ్గట్లు బంగారం పెట్టిపోతలు ఉంటాయి. బంగారు అభరణాలకు డిమాండ్ తగ్గకపోవడంతో ప్రస్తుతం బంగారం ధర రూ.87వేలకు పైగానే ఉంది. అయితే, చాలా మంది పెండ్లి హడవుడిలో పడి బంగారం విషయంలో అప్రమత్తంగా ఉండరు. దీనివల్ల మోసాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బంగారు ఆభరణాల కొనుగోలు విషయంలో కొన్ని మెలకువలు పాటించాలంటున్నారు నిపుణులు. ఆ వివరాలు మీ కోసం
క్రాస్ చెక్ చేయండి:బంగారం కొనుగోలు చేసేముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆ రోజు ఉన్న బంగారం ధర. బంగారం ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. రోజూ మారుతూనే ఉంటుంది. నగరాలు, ప్రాంతాల ఆధారంగా కూడా వీటి ధరలో వ్యత్యాసం ఉంటుంది. బంగారం స్వచ్ఛతపైనే బంగారు ఆభరణాల రేట్ ఆధారపడి ఉంటుంది. అందుకనే ఆభరణాలు కొనుగోలు సమయంలో ప్రస్తుతం బంగారం ధర ఎంత? స్వచ్ఛత ఎలా ఉంది? ఇలా అన్ని విషయాలూ క్షుణ్ణంగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువ రాగి వాడతారు!:బంగారం- 24 క్యారెట్లను 99.9 శాతం స్వచ్ఛమైనదిగా భావిస్తారు. ఇది కేవలం బిస్కెట్లు, కాయిన్స్, బార్స్ రూపంలో మాత్రమే లభిస్తుంది. 22 క్యారెట్లను నగల తయారీలో ఉపయోగిస్తారు. ఇది 916 స్వచ్ఛతలో 91.6 శాతంగా ఉంటుంది. ఇక్కడే కొంతమంది వ్యాపారులు మోసాలకు తెర లేపుతుంటారు. నాణ్యతను పరిశీలించే క్యారెక్టరైజేషన్ యంత్రం ఉపయోగించరు. ఆభరణం తయారీలో ఎక్కువ రాగి వాడతారు. ప్యూరిటీని తెలిపే హాల్‌మార్క్ ఇవ్వరు. 22 క్యారెట్లంటూ 18 క్యారెట్ల బంగారు ఆభరణాల్ని కట్టబెడుతుంటారు. కాబట్టి, జాగ్రత్తగా పరిశీలించాలని చెబుతున్నారు.
సరిపోల్చండి:ఎప్పుడైనా సరే హడావిడిగా బంగారాన్ని కొనుగోలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేముందు వేర్వేరు నగల షాపులకు వెళ్లి ధరల్ని చెక్ చేయమని సూచిస్తున్నారు. అక్కడ నాణ్యత ఎలా ఉంది? మేకింగ్ ఛార్జీలు ఎంత మొత్తంలో విధిస్తున్నారు? ఇలాంటి అంశాల్ని తెలుసుకొని, ఒకదానితో మరొకటి సరిపోల్చండి. మీకు ఏ షాపులో తక్కువ అనిపిస్తే అక్కడే కొనుగోలు చేయండి.