Family Members Installed Bull Idols in Annamayya District : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురంలో 15 ఏళ్ల క్రితం రెండు ఎద్దులు మృతి చెందడంతో వాటి జ్ఞాపకార్థం విగ్రహాలు తయారు చేయించి ప్రతిష్టించాడు ఓ యజమాని. పెద్దపయ్య కుటుంబం అన్ని విధాలా అభివృద్ధి చెందడానికి ఆ ఎద్దుల కష్టం ఎంతో ఉందని గ్రామస్థులు తెలిపారు. పెద్దపయ్య ఇంటిలో మొదట కోడె దూడ జన్మించింది. దానికి జత కోసం మరో ఎద్దును కొన్నారు. అవి వారి కుటుంబం అభివృద్ధికి ఎంతో కష్టపడ్డాయన్నారు. పొలంలో బండి కట్టి ఇంటికి వెళ్లమని ఆదేశిస్తే మధ్యలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటికి చేరుకునేవని కుటుంబసభ్యులు తెలిపారు.
శ్రీశైలంలో కన్నుల పండువగా రథోత్సవం.. ఒంగోలులో ఎడ్ల బండలాగుడు ప్రదర్శన
గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎద్దులకు పూజలు చేస్తే సమస్యలు తొలగిపోయేవని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల క్రితం ఒక ఎద్దు రోడ్డు ప్రమాదంలో చనిపోగా, మరో ఎద్దు ఇంటి దగ్గరే చనిపోయిందన్నారు. ఈ కాడెద్దులు పెద్దపయ్య కుటుంబానికి అభివృద్ధి కోసం చేసిన కష్టానికి గుర్తుగా ఊరి పొలిమేరలో చిన్నపాటి ఆలయం నిర్మించి అందులో ఎద్దుల విగ్రహాలను ఏర్పాటు చేయించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మూడో శుక్రవారం విగ్రహాలకు వైభవంగా పూజలు చేసి అన్నదాన కార్యక్రమం చేస్తున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.