Houston Protest :కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై అమెరికాలో పలువురు వైద్యులు ఆందోళన చేపట్టారు. ఇందులో హ్యూస్టన్, టెక్సాస్ మెడికల్ సెంటర్‌కు చెందిన వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు పాల్గొన్నారు. వీరిలో చాలా మంది భారత్‌లో వైద్య శిక్షణ పొందారు. విధి నిర్వహణలో హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలికి న్యాయం జరిగేందుకు అంతా కలిసి రావాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రాణాలు కాపాడే వైద్యుల ప్రాణాలు రక్షించాలని నినదించారు. భారత్‌లోని ఆసుపత్రులలో వైద్యులపై హింసను అరికట్టడానికి, నిందితులను శిక్షించడానికి నిర్ణయాత్మక సమర్థవంతమైన చట్టం లేకపోవడం ఏళ్లుగా అందరినీ కలవరపెడుతోందన్నారు.
కోల్‌కతా డాక్టర్ హత్యాచారం ఘటనపై అమెరికాలో వైద్యులు నిరసన (ETV Bharat) వైద్యురాలి హత్యాచారం కేసులో కీలక మలుపులు
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9 రాత్రి జూనియర్ వైద్యురాలి హత్యాచారం జరిగింది. కానీ తొలుత బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. అనంతరం ఇది హత్యాచారంగా తేలింది. దీనితో సివిక్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఇది ఒక్కరు చేసిన హత్యాచారం కాదని, పలువురు కలిసి గ్యాంగ్ రేప్ చేసినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలింది.
ఈ కేసులో అప్పటి ఆర్‌జీ కర్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తీరు కూడా చాలా దారుణంగా ఉంది. మొదట్లో ఆయన మృతురాలిదే తప్పు అన్నట్లు మాట్లాడారు. తరువాత మాటమార్చారు. అవమానాలు భరించలేక ప్రిన్సిపల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఆయనను అంతకంటే పెద్ద వైద్యకళాశాలకు ప్రిన్సిపల్‌గా నియమించారు. దీనితో తీవ్ర విమర్శలు చెలరేగాయి.
సందీప్ ఘోష్ చివరికి శవాలను, వాడేసిన సిరంజులను కూడా వదలకుండా, వాటిని అమ్మేసి డబ్బులు చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు వైద్యురాలి హత్యాచారం ఘటనలోనూ అతనికి పాత్ర ఉన్నట్లు అనుమానాలు వచ్చాయి. దీనితో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. కానీ మమతా బెనర్జీ ప్రభుత్వం మాత్రం చాలా ఆశ్చర్యకరమైన పనులు తీసుకుంది. ఆర్‌జీ కర్ కాలేజ్‌లో ఆందోళన చేపట్టిన పలువురు వైద్యులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేసింది. కేసు దర్యాప్తును వేగవంతం చేయడంలోనూ విఫలమైంది. దీనితో మమత సర్కార్‌పై కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరికి సుప్రీంకోర్ట్ కూడా బంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. బంగాల్ వైద్యురాలిపై అత్యాచారం, హత్యను భయంకరమైన చర్యగా సుప్రీం కోర్టు అభివర్ణించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో తీవ్రమైన జాప్యం జరగడంపై బంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.
మరోవైపు సాక్ష్యాధారాలను రూపుమాపే కుట్ర కూడా జరిగింది. ఘటనా స్థలంలో రినోవేషన్ చేయడం, కొంత మంది ఆందోళన చేస్తున్న పేరుతో, ఘటనా స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం లాంటివి జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించారు. ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపల్‌కు, నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలీగ్రాఫ్ టెస్ట్ చేయాలని నిర్ణయించారు. అయితే సంజయ్ రాయ్ మాత్రం ఈ పాలీగ్రాఫ్ టెస్ట్‌లో పూర్తిగా అబద్ధాలు చెప్పినట్లు తెలుస్తోంది.
అమెరికాలో కొవ్వొత్తులతో వైద్యుల ప్రదర్శన (ETV Bharat) అమెరికాలో కోల్‌కతా డాక్టర్ హత్యాచారానికి వ్యక్తిరేకంగా వైద్యుల ఆందోళన (ETV Bharat) అమెరికాలో వైద్యుల నిరసనలు (ETV Bharat)