White Tea Health Benefits:మంచి నీళ్ల తర్వాత ఎక్కువగా తాగే పానీయాలు టీ, కాఫీ. ప్రపంచంలో ఎక్కడైనా ఇదే పరిస్థితి ఉంటుంది. స్నేహితులు, బంధువులు ఇలా ప్రతి ఒక్కరితో కూర్చొని మాట్లాడే సమయంలో టీ లేదా కాఫీ ఉండాల్సిందే. కొందరు రోజూ ఉదయం, సాయంత్రం సమయంలో తాగుతారు. కానీ, కొంతమందికైతే రోజులో 5-6 సార్లైనా తాగుతుంటారు. అయితే టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని భావించి.. ఈ మధ్య కాలంలో చాలా మంది హెర్బల్ టీల వైపు మళ్లుతున్నారు. అయితే హెర్బల్ టీ లలో కేవలం గ్రీన్, లెమన్ టీని మాత్రమే ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇవే కాకుండా వైట్ టీని తీసుకోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ టీని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడం:వైట్ టీ తాగడం వల్ల జీవక్రియ పనితీరు మెరుగుపడుతుందని వైద్యులు తెలుపుతున్నారు. ఫలితంగా కొవ్వు కరిగిపోయిబరువు తగ్గుతారని (రిపోర్ట్) వివరించారు. 2018లో యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం వైట్ టీ వినియోగం బరువు తగ్గేలా చేస్తుందని.. అధిక బరువు ఉన్న వ్యక్తుల్లో జీవక్రియ ప్రమాద కారకాలను తగ్గిస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పోర్టో యూనివర్సిటీలో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్సెస్లో ఫ్యాకల్టీ డాక్టర్ Ana Sousa పాల్గొన్నారు.
యాంటీయాక్సిడెంట్:వైట్ టీలో అధికంగా యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి కణాలు దెబ్బ తినకుండా కాపాడడం, వాపు, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేస్తాయని వివరిస్తున్నారు.
గుండె ఆరోగ్యం మెరుగు:వైట్ టీని తరచుగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయులు, అధిక రక్తపోటును తగ్గిస్తుందని చెప్పారు. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడి సమస్యలు రావని చెబుతున్నారు.
క్యాన్సర్ రాకుండా చేస్తుందట:ఇందులో క్యాన్సర్ రాకుండా ఉండే కణాలు ఉంటాయని తెలిపారు. క్రమం తప్పకుండా ఈ టీని తాగడం వల్ల పెద్ద పేగు, పొత్తి కడుపు, రొమ్మ క్యాన్సర్ రాకుండా చేస్తుందని తెలుపుతున్నారు.
వయసు తక్కువగా కనిపిస్తారట:వైట్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల ముడతలు, వృద్ధాప్య మచ్చలను తగ్గిస్తుందని.. ఫలితంగా వయసు కూడా తక్కువగా కనిపిస్తారని చెబుతున్నారు.