Medicine Made From Blood:మీకు ఏదైనా గాయం తగిలిందా? లేదా ఎముకలు విరిగిపోయాయా? ఇకపై ఎలాంటి ఇబ్బంది అక్కర్లేదు. ఇలాంటి వారికోసం అద్భుతమైన మందును కనిపెట్టారు పరిశోధకులు. కృత్రిమంగా రూపొందించే సింథటిక్ పెప్టైడ్స్, మానవ రక్తాన్ని కలిసి ఈ సరికొత్త పదార్థాన్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఇది గాయపడిన శరీర భాగాలను త్వరగా నయం అయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. ఇంకా విరిగిన ఎముకలు బాగు చేయడంలోనూ ఇది మెరుగైన ఫలితాలు ఇచ్చిందని అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హామ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ అండ్ కెమికల్ ఇంజినీరింగ్ పరిశోధకులు దీనిని ఆవిష్కరించారు. భవిష్యత్తులో గాయాలు, వ్యాధుల చికిత్సలకు ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
మనకు తగిలే చిన్న గాయాలు, ఫ్యాక్చర్స్ను శరీరం చాలా అద్భుతంగా బాగు చేసుకుంటుంది. సహజంగా జరిగే ఈ ప్రక్రియలో మానవ రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో ఉండే హెమటోమా అనే పునరుత్పత్తికి సంబంధించిన పదార్థం ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇది కణజాలాలను బాగుచేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మానవ రక్తానికి కృత్రిమంగా రూపొందించిన సింథటిక్ పెప్టైడ్స్‌ను కలిపి ఓ బయోకోపరేటివ్ పదార్థాన్ని రూపొందించారు శాస్త్రవేత్తలు. ఇది అణువులు, కణాలు, కణజాలాలను సహజంగా బాగు చేయడానికి ఉపయోగపడుతుందని వివరించారు.
ఈ బయోకోపరేటివ్ పదార్థం తయారీ, వినియోగం సులభంగా చేసుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు. దీనిని ఇప్పటికే జంతువుల రక్తంతో పరిశోధనలు చేయగా మెరుగైన ఫలితాలు ఇచ్చిందని పేర్కొన్నారు. జంతువుల ఎముకలను బాగు చేయడంలో ఇది విజయవంతం అయినట్లు పరిశోధక బృందం వెల్లడించింది. "మానవుల రక్తాన్ని సులభంగా, సురక్షితంగా అత్యంత పునరుత్పత్తి ఇంప్లాంట్‌లుగా మార్చే అవకాశం ఉందని కనుగొనడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వాస్తవానికి రక్తం ఉచితంగా లభ్యం అవుతుంది. ఇంకా అవసరమైతే రోగుల బంధువుల నుంచి సులభంగా పొందవచ్చు. వైద్య చికిత్సలో భాగంగా ఎవరైనా సరే సులభంగా ఉపయోగించేలా ఓ టూల్ కిట్‌ను ఏర్పాటు చేయడమై మా లక్ష్యం." అని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు డాక్టర్ కోసిమో లిగోరియో అన్నారు.