Liver Cleanse Drink Homemade:మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా లివర్ ఆరోగ్యంగా ఉండాలి. కానీ, మద్యపానం, మారిన ఆహారపు అలవాట్ల వల్ల కాలేయంలో అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ట్యాక్సిన్స్ పేరుకుపోయి కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు అనేక మంది డీటాక్స్ డ్రింక్స్ తాగుతుంటారు. కానీ ఆయుర్వేద పద్ధతిలో ఈ సమస్య పరిష్కారానికి చక్కటి మార్గం ఉందని ప్రముఖ వైద్యురాలు గాయత్రీ దేవీ చెబుతున్నారు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 75 గ్రాముల త్రిఫలాల చూర్ణం
- 25 గ్రాముల కటుక రోహిణి చూర్ణం
- 25 గ్రాముల నేల వేము చూర్ణం
తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెను తీసుకుని అందులో త్రిఫలాల చూర్ణం, కటుక రోహిణి చూర్ణం, నేల వేము చూర్ణం కలిపి బాగా కలపాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో 70 మిల్లీ లీటర్లు నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.
- అనంతరం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని 10 గ్రాముల వేసి మరిగించుకోవాలి.
- నీళ్లు బాగా దగ్గర పడిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి దీనిని వడపోసుకుంటే ఔషధం రెడీ!
దీనిని ఉదయం, సాయంత్రం భోజనం చేసిన 15 నిమిషాల తర్వాత తీసుకోవాలని చెబుతున్నారు. ఇలా రెండు పూటల పాటు కొన్ని నెలల తీసుకుంటే లివర్ ఆరోగ్యానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా కామెర్లు, కాలేయ సమస్య ఉన్నవారు ఇది తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా మద్యపానం మానేసి లివర్ ఆరోగ్యంగా ఉంచుకోవాలని అనుకునేవారు దీనిని తీసుకోవాలని సూచిస్తున్నారు.
త్రిఫలాలు: ఉసిరి కాయలు, కరక్కాయాలు, తానికాయలను సమానంగా కలిపితే త్రిఫలాలు అంటారు. వీటికి శరీరంలోని మలినాలను బయటకు పంపించే స్వభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు వీటికి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయని వివరిస్తున్నారు.