Life Span Increasing with Friendship: మీకు ఫ్రెండ్స్ ఉన్నారా..? వారితో ఉత్సాహంగా, సంతోషంగా గడుపుతున్నారా? అయితే మీరు అనారోగ్యాల బారిన తక్కువ పడతారట! ఫలితంగా ఆయుష్షు సైతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. స్నేహబంధానికి జీవనకాలాన్ని పెంచే శక్తి ఉంది అంటోంది ‘ఎపిడెమియాలజీ అండ్ సైకియాట్రిక్ సైన్సెస్’ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం. 2019లో Social relationships and mortality risk: a meta-analytic review" పేరిట ప్రచురితమైన అధ్యయనంలోనూ ఈ విషయం వెల్లడైంది. ఎక్కువకాలం జీవించడానికి స్నేహం ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ఇందులో Brigham Young Universityకి చెందిన అసోసియేట్ ఫ్రొఫెసర్ ఆఫ్ సైకాలజీ Holt-Lunstad, J పాల్గొన్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మంచి స్నేహితులు ఎలా ఉంటారు?
స్నేహితులు మన శ్రేయస్సును కోరుతూ.. మంచి జరగాలని ప్రార్థిస్తుంటారు. సమస్యలను పంచుకుంటే పరిష్కారాన్ని చూపించడానికి సాయం చేస్తారు. వీరి సహాయంతో ఒడుదొడుకులెన్ని ఎదురైనా దాటగలిగే శక్తిని పొందగలుగుతాం. కొన్ని విషయాలను కుటుంబసభ్యులతో కాకుండా స్నేహితులతో మాత్రమే మనసువిప్పి పంచుకోగలం. ఇలా మన మనసును అర్థం చేసుకోగలిగేవారే మంచి స్నేహితులు అవడానికి అవకాశం ఉంటుందట. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యం, ప్రియమైనవారు దూరమవడం వంటి కష్టాలు ఎదురైనప్పుడు మన భావోద్వేగాలకు స్నేహితులే మద్దతుగా నిలుస్తుంటారు. ఒంటరితనంలో కూడా నిజమైన సానుభూతిని అందించి నేనున్నానంటూ చేయూతను అందించి.. తిరిగి జీవితంలోకి అడుగుపెట్టేలా చేస్తారు.
ప్రయోజనాలు ఇవే!
బాధ్యతలన్నీ తీరడం, ఉద్యోగవిరమణ, మెనోపాజ్ వంటివాటి తర్వాత చిన్ననాటి స్నేహబంధం అందించే చేయూత మరేదీ ఇవ్వలేదని నిపుణులు అంటున్నారు. ఒక్కసారిగా జీవితంలో ఏర్పడే వెలితిని స్నేహంతో పూరించొచ్చని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా స్నేహితులతో కలిసి చేసే పర్యటనలు, చిన్ననాటి జ్ఞాపకాలున్న ప్రాంతాలను సందర్శించడం వంటివన్నీ మనసును తేలికపరుస్తాయంటున్నారు. ఈ బంధంవల్ల దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తక్కువగా ఉంటుందని.. మధుమేహం, అధికరక్తపోటు, హృద్రోగ సమస్యలకు దూరంగా ఉండొచ్చంటున్నారు. ఆందోళన, ఒత్తిడి, నిరాశవంటివి దరిచేరవని పేర్కొన్నారు. ఇంకా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగలిగే శక్తిని స్నేహం ద్వారా పొందవచ్చని వెల్లడిస్తున్నారు. ఇలా ఆరోగ్యంతోపాటు జీవితకాలాన్ని పెంచేందుకు స్నేహం ఉపయోగపడుతుందని అంటున్నారు.