Finger Millet Benefits :దంతాలు, ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండడానికి పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా ఎంపిక చేసుకుంటాం. కానీ, కొందరికి పాలలో ఉండే లాక్టోజ్ జీర్ణం కాదు. అలాగే బరువు తగ్గాలనిప్రయత్నించేవారు చాలా మంది డైరీ ఉత్పత్తులకు దూరంగా ఉంటారు. అలాంటి వారు పాలు, పాల ఉత్పత్తులకు బదులుగా రాగులను తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మధుమేహం, అధిక రక్తపోటు :
మనలో చాలా మంది నేటి యాంత్రిక జీవనంలో పరుగులు తీస్తూ సరైన సమయానికి భోజనం చేయడం లేదు. ఉద్యోగాలు, వ్యాపార కారణాల వల్ల అటూఇటూ పరుగులు తీసేవారు బయట రెస్టారెంట్లు, హోటళ్లలో భోజనం చేస్తున్నారు. ఇలా సరైన టైమ్‌కు సమతుల ఆహారం తీసుకోకపోవడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి.
అయితే, ఇలా షుగర్, బీపీతో బాధపడే వారికి రాగులు చక్కటి ఆహారమని నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్‌లో చక్కెర శాతాన్ని నియంత్రించడానికి తోడ్పడతాయి. షుగర్‌తో బాధపడే వారు తరచూ రాగులు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యులు బృందం స్పష్టం చేసింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
డయాబెటిస్‌తో బాధపడే వారికి పాలకన్నా రాగులే మంచి ఎంపిక! అలాగే వీటిల్లో అమైనో యాసిడ్లు, ఫైబర్, ఐరన్ వంటివి అధికంగా ఉంటాయి. సమతులాహారాన్ని తినాలనుకునే వాళ్లూ రాగులను డైట్లో భాగం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.