తెలంగాణ

telangana

కాఫీ Vs టీ- రెండిట్లో ఏది బెస్ట్​? మార్నింగ్​ లేవగానే తాగితే ఆరోగ్యానికి ప్రమాదమా?

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 7:15 AM IST

Coffee Tea Which Is Better For Health : మనలో చాలామందికి ఉదయం లేచిన దగ్గరి నుంచి కాఫీనో లేదంటే టీనో తాగే అలవాటు ఉంటుంది. కొందరైతే కాఫీ లేదంటే టీ తాగకపోతే పొద్దుగడవని పరిస్థితిలో కూడా ఉంటారు. అయితే కాఫీ, టీలో ఏది మంచిది? ఎంత మొత్తంలో తాగాలనే దానిపై చాలామందికి స్పష్టత ఉండదు. ఈ విషయాలపై మరింత లోతుగా తెలుసుకుందాం.

Coffee Tea Which Is Better
Coffee Tea Which Is Better

Coffee Tea Which Is Better For Health :ఉదయం లేచిన తర్వాత బ్రష్ చెయ్యగానే, కొంతమందికి బెడ్ మీదే కాఫీ లేదంటే టీ తాగే అలవాటు ఉంటుంది. టీ లేదా కాఫీ తాగిన తర్వాతే రోజు మొదలుపెడతారు. తరతరాలుగా కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉన్న వాళ్లు అసలు ఈ రెండింట్లో ఏది తాగితే మంచిది అనే ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతూ ఉంటారు. అలాగే ఎంత మోతాదులో కాఫీ లేదా టీ తాగాలి, వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కాఫీ, టీలో ఏది మంచిదంటే? : కాఫీ లేదా టీలో ఏది తాగితే మంచిది అనే ప్రశ్నకు వైద్యులు కాఫీకే ఓటేస్తున్నారు. అయితే కాఫీ, టీ ఏదైనా తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

కాఫీ ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది?
'కాఫీ తాగడం వల్ల శరీరానికి బయోయాక్టివ్, పాలిఫినోలిక్ కంపౌండ్స్, ప్రోటీన్స్, డైటార్పిన్స్ అందుతాయి. కాఫీలో ఉండే కెఫిన్ శరీరానికి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తలనొప్పి, అలసటగా ఉన్నప్పుడు కప్పు కాఫీ తాగితే వెంటనే ఆ సమస్య తీరినట్లు అనిపిస్తుంది. దీంతో పాటు అలసట నుంచి ఉపశమనం కలుగుతుంది. అవసరమైన మోతాదులో మాత్రమే కాఫీ తీసుకోవాలి. 18 ఏళ్లు పైబడిన వారు రోజుకు 1 నుంచి 2 కప్పుల కాఫీ తాగితే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. సాధారణంగా ఉదయం, సాయంత్రం పూట ఒక్కో కప్పు కాఫీ తీసుకుంటే మంచిది' అని ప్రముఖ డైటీషియన్​ డా.శ్రీలత వివరిస్తున్నారు.

గుండె ఆరోగ్యానికి ఇవి ఎలా పని చేస్తుందంటే?
ప్రముఖ డైటీషియన్​ డా.శ్రీలత కాఫీ, టీ తీసుకునే విషయంలో ఈ సూచనలు చేశారు.

  • రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది.
  • కాఫీ తాగడం వల్ల గుండె కవాటాలకు మేలు జరిగి పనితీరు మెరుగవుతుంది. బ్లాక్ కాఫీ లేదా ప్లెయిన్ కాఫీ తీసుకుంటే ఉత్తమం.
  • ఇన్ స్టాంట్ కాఫీల కన్నా ఫిల్టర్ కాఫీలు ఆరోగ్యానికి మంచిది.
  • కోల్డ్ కాఫీ, ల్యాటే, మోచా, క్యాపిచినో లాంటి కాఫీలకు దూరంగా ఉంటేనే మంచిది
  • కోల్డ్​ కాఫీ, ల్యాటే లాంటి పదార్థాల్లో శాచురేటెడ్​, ఫ్యాట్​ కంటెంట్​ ఎక్కువ ఉంటుంది.
  • శాచురేటెడ్​ ఫ్యాట్​ వల్ల పరోక్షంగా బరువు పెరగే అవకాశం ఉంది.

ఎంత మోతాదులో తాగాలంటే?
కాఫీ కానీ టీ కానీ ఒకటి లేదా రెండు కప్పులు తాగితే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని ప్రముఖ వైద్యులు డా.మధులిక ఆరుట్ల చెబుతున్నారు. కాఫీ, టీలు అతిగా తాగడం మంచిది కాదని, దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. అలాగే చాలామంది నిద్రలేచిన వెంటనే కాఫీ లేదా టీ తాగుతారని, అదీ మంచిది కాదని వివరిస్తున్నారు. నిద్రలేచిన వెంటనే శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ విడుదల అవుతుందని, కాఫీ లేదా టీ తాగితే దీని మోతాదు మరింత పెరుగుతుందని అంటున్నారు. అలా కాకుండా నిద్ర లేచిన గంట- రెండు గంటల తర్వాత తాగాలని సలహా ఇస్తున్నారు.

కాఫీ లేదా టీ ఎక్కువ తాగితే
కొంతమంది టీ లేదా కాఫీని మోతాదుకు మించి తాగుతుంటారు. 6-7కప్పుల టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉన్న వారికి తీవ్ర నష్టం కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారిలో తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు వివరిస్తున్నారు. అలాగే శరీరానికి ఎక్కువ క్యాలరీలు అందుతాయని, ఫలితంగా కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరగడం జరుగుతుందని అంటున్నారు. అలాగే అధిక రక్తపోటు, డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్ సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

డైలీ బ్లూబెర్రీలు తింటున్నారా? మీ బాడీలో జరిగే మార్పులివే!

మీరు ఎప్పుడైనా ఎల్లో టీ తాగారా? - ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఈసారి మిస్​ అవ్వరు!

ABOUT THE AUTHOR

...view details