Tips for Succeeding in Study Abroad:ప్రతి ఏడాది చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తుంటారు. అయితే ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ పద్ధతులు, నియమ నిబంధనలు ఖచ్చితంగా తెలుసుకోవాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చి కెరీర్‌ను నాశనం చేసుకోవద్దని అంటున్నారు. విద్య కోసం వెళ్లినందున దానిపైనే ఫోకస్ చేస్తే బాగుంటుందని తెలుపుతున్నారు.
అమెరికాలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న శ్రీనివాస్ అనే విద్యార్థి తన కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. కళాశాలలో సంపాదకీయాలు చేస్తూ వివిధ రకాలైన అంశాల మీద ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన భావాలను పంచుకుంటూ ఉండేవాడు. అయితే ఇటీవల ఒక రాజకీయ అంశంపై ఇలాగే తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్ట్ అనుకోని రీతిలో వివాదాస్పదమయింది.
చాలా మందికి అతని వ్యాఖ్యలు నచ్చలేదు. అంతేగాక యూనివర్సిటీ బృందానికి సైతం వాటి సారాంశం నచ్చలేదు. దాంతో శ్రీనివాస్‌పై ఆరునెలల సస్పెన్షన్ వేటు విధించి అతడి ఫెలోషిప్‌ను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. దీంతో కంగుతిన్న శ్రీనివాస్ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమయ్యాడు.
తాజాగా జరిగిన ఈ వివాదం విదేశాలకు చదువుకై వెళ్లే విద్యార్థులు కలిగి ఉండాల్సిన ప్రవర్తన, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరోసారి చర్చకు లేవనెత్తింది. వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛకు విలువనివ్వాలనే కొందరు శ్రీనివాస్‌కు మద్దతు ఇస్తే, మరికొందరు ఇతర దేశాలకు విద్యాభ్యాసం కోసం వెళ్లిన విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పాటించాల్సిన నియమాలు: విద్యార్థులు తాము వెళ్లాలనుకుంటున్న దేశంలో పాటించవలసిన నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ప్రతిచోటా మనకు తెలియని, అలవాటు లేని, అర్థం కాని ఎన్నో విషయాలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. మనం వేరేచోట నివసిస్తున్నప్పుడు పూర్తిగా వాటిని పాటించాల్సిన అవసరం ఉంది.
కొందరు సీనియర్ విద్యార్థుల అనుభవం మేరకు:వెళ్లిన కొత్తలో ఎంతో కొంత కళాశాలలో స్థానిక విద్యార్థుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావడం సహజం. అయితే వీటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ఓర్పుగా ఉండాలి. పరిధికి లోబడి ఉంటూ ఎటువంటి వివాదాల్లోనూ జోక్యం చేసుకోకపోవడం మంచిది. ముఖ్యంగా హింసాత్మక ధోరణులు ఉన్న సమాజాల్లో మరింత అప్రమత్తత అవసరం.