ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / education-and-career

పిల్లల చదువు, పెళ్లికి డబ్బు దాస్తున్నారా? - 'పెట్టుబడికి మంచి మార్గాలివే!' - SAVING FOR CHILDRENS FUTURE NEEDS

పిల్లల భవిష్యత్​పై తల్లిదండ్రుల కలలు - ఆర్థిక ప్రణాళికలు ఇవే

investment_options_for_child_higher_education
investment_options_for_child_higher_education (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2025, 12:01 PM IST

Saving for Childrens Future Needs : పిల్లల భవిష్యత్​పై తల్లిదండ్రులు కలలుగంటుంటారు. వారిపై ఎన్నో అంచనాలు, ఆశలు, ఆశయాలు పెట్టుకుంటారు. ముఖ్యంగా వారికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రయత్నిస్తుంటారు. తమ ఆదాయంలో ఎంతో కొంత వారి కోసం పొదుపు చేస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. తల్లిదండ్రులు పొదుపు, పెట్టుబడి విషయాల్లో పిల్లలు ఎంత చిన్నగా ఉన్నప్పుడు మొదలుపెడితే అంత మంచిదని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు. ‘పవర్‌ ఆఫ్‌ కాంపౌండింగ్‌’ ద్వారా అది పెద్ద మొత్తమై వారికి ఆర్థిక స్వేచ్ఛ ఇస్తుందని, ఎలాంటి రుణం అవసరం లేకుండానే ఉన్నత చదువులు పూర్తిచేయొచ్చని వెల్లడిస్తున్నారు.

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు చక్కని భవిష్యత్తు అందించాలని కోరుకుంటారు. చదువు, వివాహం, వాహనంతో పాటు వారి కోర్కెలు తీర్చడం కోసం ఆ దిశగా పొదుపు, మదుపు తప్పనిసరి. అయితే పిన్న వయస్సులోనే పొదుపు, పెట్టుబడి ప్రారంభించడం మంచిది. దీంతో వారిపై ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. చదువు, చేస్తున్న పని పైనే దృష్టి నిలిపేలా చూసుకోవచ్చు. ఇక ఉన్నత చదువుల కోసం రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. అంతేకాదు పిల్లలు కోరుకునే బహుమతుల కొనుగోలుకు కొంత మొత్తంలో కేటాయించవచ్చు. ఇందుకు అనేక రకాల పెట్టుబడి మార్గాలున్నాయి. పిల్లల పేరుమీదే వాటిని ఎంచుకునే వీలుంది.

గుర్రాలు ఎందుకు పడుకోవు? - మీకు 'హార్స్ పవర్' అంటే తెలుసా?

ఐదేళ్లు, అంతకంటే తక్కువ కాల పరిమితి కలిగినవి స్వల్ప వ్యవధి లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. విద్యార్థుల కోసం ల్యాప్​టాప్​, కంప్యూటర్‌ కొనాలన్నా లేక స్కూల్‌ ఫీజు చెల్లించాలన్న ఫిక్స్‌డ్, రికరింగ్‌ డిపాజిట్లను ఎంచుకోవడం మంచిది. తద్వారా తక్కువ రిస్కుతో ఉండి, గ్యారంటీ రిటర్న్స్‌ అందుకోవచ్చు.

  • లిక్విడ్‌ ఫండ్స్, స్వల్ప వ్యవధి ఫండ్స్‌ తరహా మ్యూచువల్‌ ఫండ్లు షార్ట్‌ టర్మ్‌ డెట్‌లలో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటి వ్యవధి ఏడాది నుంచి ఏడాదిన్నరదాకా ఉంటుంది. రిస్కూ కూడా తక్కువే.
  • ఐదేళ్ల నుంచి పదేళ్లు కలిగిన మధ్య వ్యవధి లక్ష్యాల కోసం ఈక్విటీ, డెట్‌ రెండూ కలిపి మదుపు చేసే హైబ్రిడ్‌ ఫండ్స్‌ ఎంచుకోవాలి. ఇవి కళాశాల స్థాయిలో విద్యార్థుల ఫీజు, అవసరాలు, మొదటి వాహనం కొనేందుకూ ఉపయోగపడతాయి.
  • పదేళ్లకు మించినవి దీర్ఘకాల లక్ష్యాలు. ఇలాంటి పెట్టుబడులు ఉన్నత చదువులతో పాటు, వివాహం, ఇల్లు కొనుగోలు సమయంలో డౌన్‌పేమెంట్‌ కోసం ఉపయోగపడతాయి.
  • ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో చెప్పుకోదగ్గ రిటర్న్స్‌ పొందే అవకాశాలున్నాయి.
  • పిల్లల అవసరాల దృష్ట్యా పిల్లల మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయి. మైనారిటీ తీరేవరకూ వాటికి లాక్​-ఇన్ పీరియడ్‌ ఉంటుంది.
  • పీపీఎఫ్‌ పథకంలో అధిక వడ్డీ ప్రయోజనంతో పాటు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
  • బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెచ్చిన పథకం సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకంలో పొదుపు ద్వారా మెరుగైన వడ్డీ, పన్ను మినహాయింపు ఉంటుంది.

గోల్డ్‌ ఈటీఎఫ్‌లో పెట్టుబడులకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం మేలు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడమే గాకుండా పెట్టుబడుల్లో వైవిధ్యం కనిపిస్తుంది. పెట్టుబడులకు తోడుగా టర్మ్‌ పాలసీ తీసుకోవడం వల్ల ఆర్థిక లక్ష్యాలకు భద్రత ఉంటుంది. వీలునామా రాసి పెట్టడం వల్ల పిల్లలకు ఆస్తులు సులభంగా అందే వీలుందని సర్టిపైడ్ పైనాన్షియల్ ప్లానర్ గోలె శిల్పా భాస్కర్ వెల్లడించారు.

12% వడ్డీ అంటే ఒక్క రూపాయి - బ్యాంకు లోన్లపై వడ్డీ సింపుల్​గా ఎలా లెక్కించాలంటే!

ధర తక్కువ ఫోన్లతో బుక్ చేస్తే తక్కువ ఛార్జీలు? - ఓలా, ఉబర్​కు కేంద్రం నోటీసులు

ABOUT THE AUTHOR

...view details