ITR Filing 2024 Deadline :ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వారికి జులై నెల చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఐటీఆర్ దాఖలుకు ఆఖరు తేదీ జులై 31. ఆదాయ పన్ను శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే, ఇన్‌కమ్ ట్యాక్స్ క్యాలెండర్ను కచ్చితంగా ఫాలో కావాల్సిందే. లేదంటే భారీగా పెనాల్టీలు, అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావొచ్చు. కొన్నిసార్లు గడువు దాటితే చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
డెడ్లైన్
ఈ 2024-25 అసెస్మెంట్ ఇయర్ కోసం ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ 2024 జులై 31. కనుక ఈ గడువులోగా మీరు కచ్చితంగా మీ ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే?
పొరపాట్లు చేయకుండా చూసుకోవచ్చు!
గడువు కన్నా ముందుగానే ఐటీఆర్ఫైల్ చేయడం మంచిది. ఎందుకంటే, మీకు కావాల్సిన సమాచారం, డాక్యుమెంట్లను సమకూర్చుకునేందుకు తగినంత సమయం దొరుకుతుంది. దీంతో ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవచ్చు. మీ ఐటీఆర్తో ఆధార్, పాన్, ఫారం-16, సాలరీ స్లిప్, బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి వడ్డీ సర్టిఫికెట్లు, ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడుల ధ్రువీకరణ పత్రాలు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రిసిప్టులు మొదలైన పత్రాలను జత చేసుకోవచ్చు.
తప్పులు సరిదిద్దుకోవచ్చు!
ఐటీఆర్ ఫైలింగ్ చేస్తే, సగం పని మాత్రమే పూర్తయినట్లు లెక్క. తరువాత దానిని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పన్ను చట్టాల ప్రకారం, ఫైలింగ్ చేసిన 30 రోజుల్లోగా వెరిఫై చేసుకోవాలి. ముందస్తుగా ఐటీఆర్ ఫైలింగ్ చేయడం ద్వారా వెరిఫై చేసుకుని తప్పులను సరిచేసుకునేందుకు మనకు తగినత సమయం లభిస్తుంది.