Factory Blast At Maharashtra :మహారాష్ట్ర భండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి 8 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని ఎల్‌టీపీ సెక్షన్లో పేలుడు జరిగిందని జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్తే వెల్లడించారు. మృతులను చంద్రశేఖర్ గోస్వామి (59), మనోజ్ మేష్రామ్ (55), అజయ్ నాగదేవ్ (51), అంకిత్ బరాయ్ (20), లక్షం కెల్వాడే (38), అభిషేక్ చౌరాసియా (35), ధర్మ రంగరి (35), సంజయ్ కరేమోర్‌గా గుర్తించారు.
ఎల్‌టీపీ విభాగంలో పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది. ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక విభాగం సిబ్బంది ఎంతో శ్రమించారు. వారికి పోలీసులు, స్థానిక విపత్తు నిర్వహణ విభాగం బృందాలు సహాయం చేశాయి.
ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, మృతుల సంఖ్యపై కాసేపటి తర్వాత అధికారిక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. "భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 8 మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు" అని నాగ్‌పుర్‌లో వెల్లడించారు. పేలుడు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ ఒక నిమిషం మౌనం పాటించారు.