Sheikh Hasina son Sajid Wajid Comments :రాజ్యాంగ బద్ధంగా ఇంకా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనానే అని ఆమె కుమారుడుసాజిబ్ వాజిద్ అన్నారు. బంగ్లాదేశ్‌లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. పోలీసులపై నిరసనకారులు దాడులు జరపడం వల్ల వారు ఉద్యోగాలను వదిలేస్తున్నారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై హసీనా కుమారుడు సాజిబ్ 'ఈటీవీ భారత్'తో పలు కీలక విషయాలు షేర్ చేసుకున్నారు.
"సరిహద్దు గార్డులు కొంత అల్లర్లను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఢాకా వెలుపల, ముఖ్యంగా అవామీ లీగ్ పార్టీ నాయకులే లక్ష్యంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. షేక్ హసీనా దిల్లీలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆమె ఎక్కడికి వెళ్లే ఆలోచనలో లేరు. ఆమె అవామీ లీగ్ పార్టీ నాయకులతో టచ్‌లో ఉన్నారు. మా పార్టీ వ్యక్తులపై దాడులు చేసినవారిని ఎప్పటికీ విడిచిపెట్టం. రాజ్యంగ బద్ధంగా షేక్ హసీనా ఎన్నడూ రాజీనామా చేయలేదు, ఆ అవకాశం కూడా ఆమెకు రాలేదు. అది రాజ్యాంగ సమస్య. రాజ్యాంగబద్ధంగా ఇప్పటికే ఆమే బంగ్లాదేశ్‌కు ప్రధాన మంత్రి. అవామీ లీగ్ పార్టీ బంగ్లాదేశ్‌లో పురాతన, అతిపెద్ద రాజకీయ పార్టీ. ఆవామీ లీగ్ కథ ఇంకా ముగిసిపోలేదు. మేము ఎక్కడికీ వెళ్లడం లేదు. అవామీ లీగ్ మళ్లీ తిరిగి వస్తోంది." అని సాజిబ్ వాజిద్ వ్యాఖ్యానించారు.
మోదీ, భారత సర్కార్‌కు థ్యాంక్స్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, తన తల్లి షేక్ హసీనాకు సాయం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, భారత ప్రభుత్వానికి సాజిబ్ వాజిద్ కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వం వేగంగా స్పందించి షేక్ హసీనా ప్రాణాలను కాపాడిందని వివరించారు. బంగ్లాదేశ్‌లో లౌకిక ప్రభుత్వం లేకుండా నిరసనకారులు చేశారని మండిపడ్డారు. మైనారిటీలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో ఎవరున్నా మిలిటెన్సీని ఖండించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని అభిప్రాయపడ్డారు. ఢాకాలో శాంతి భద్రతలు కొంత నియంత్రణలో ఉన్నాయని, ఆ నగరం వెలుపల హింస కొనసాగుతోందని ఆరోపించారు.