తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని డయల్ 100కి కాల్ చేసి చెప్పడం వల్ల చాకచక్యంగా వ్యవహరించి ఓ యువకుడిని కాపాడారు భువనగిరి పోలీసులు. ఫోన్లో మాట్లాడుతూనే తాను ఉన్న ప్రదేశానికి చేరుకోవడంతో పాటు ఆ మార్గంలో వస్తున్న గూడ్స్ రైలు లోకోపైలెట్‌ను పోలీసులు అప్రమత్తం చేశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని హుస్నాబాద్‌కి చెందిన ఓ యువకుడు కుటుంబ కలహాల నేపథ్యంలో రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడుతున్నానని డయల్ 100కి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే డయల్ 100 సిబ్బంది సదరు వ్యక్తితో మాట్లాడుతూనే భువనగిరి పోలీసులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న కానిస్టేబుల్ రామారావు, హోంగార్డ్ శ్రీనివాసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి చాకచక్యంగా సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో గూడ్స్ రైలు లోకో పైలెట్‌ను అప్రమత్తం చేశారు. యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం యువకుడికి ఎస్సై వినోద్ కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు రామారావు, శ్రీనివాసులును రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ట్విట్టర్ ద్వారా అభినందించారు.
ఇదీ చదవండి: తెలంగాణలో నేరం చేస్తే.. తప్పించుకోవడం కష్టమే సుమా!