హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి బరిలోకి దిగుతున్నారు. గత రెండు నెలలుగా నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ... అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరుతూ వచ్చారు. పలు స్థానిక సభల్లో పాల్గొంటూ వచ్చిన ఉత్తమకుమార్ రెడ్డి ఇటీవల అభ్యర్థి తన సతీమణినే ఉంటుందని అధిష్ఠానం ప్రకటన చేయక ముందే వెల్లడించారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి వద్ద ఫిర్యాదు చేయడంతో పాటు షోకాజ్ నోటీసు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో ఇష్ఠాగోష్టిగా మాట్లాడిన సమయంలో రేవంత్ రెడ్డి తాను చామల కిరణ్‌కుమార్ రెడ్డిని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలంతా తీవ్రంగా స్పందించారు.
నిన్నటి వరకు అభ్యర్థి ప్రకటనపై భిన్న వాదనలు వినిపించాయి. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి తన సతీమణిని అభ్యర్థిగా తెచ్చుకోలేకపోతే... విలువ ఉండదని భావించిన ఉత్తమ్.. రేవంత్ రెడ్డి మాటలను ఖాతరు చేయకుండా మంగళవారం దిల్లీ వెళ్లి అధిష్ఠానం వద్ద క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించారు. ప్రత్యర్థి సైదిరెడ్డి గత ఎన్నికల్లో తనకు గట్టి పోటీ ఇచ్చారని కూడా వివరించారు. ఆలాంటిది ప్రస్తుతం ప్రభుత్వం వాళ్లది.... అయినందున పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటారన్న విషయాన్ని కూడా ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు అభ్యర్థి విషయంలో తన పంతం నెగ్గించుకుని పద్మావతి రెడ్డిని అధిష్ఠానం నుంచి ప్రకటింప చేసుకున్నారు.
అధికార పార్టీ అభ్యర్థి గతంలో తనపై పోటీ చేసి... ఏడున్నర వేల తేడాతో ఓటమిపాలైన సైదిరెడ్డి గెలుపునకు తెరాస అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఏదొక విధంగా కాంగ్రెస్ కోటకు బీటలు కొట్టాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలవడానికి మరింత శ్రమ పడాల్సి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే పీసీసీ అధ్యక్షుడు జిల్లాలోని కోమటి రెడ్డి బ్రదర్స్, జానా రెడ్డిలతోపాటు సీనియర్లను కలుపుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. దీనికి తోడు తెలంగాణ జనసమితి, వామపక్షాలు, ఇతర ప్రజాసంఘాల మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయా పార్టీల నేతలను, ప్రజాసంఘాల నేతలను ఒక్కొక్కరిని కలుస్తూ... హూజూర్ నగర్ ఉప ఎన్నికలో నిలబడుతున్న తన సతీమణి గెలుపునకు సహకారం అందించాలని కోరుతూ వారి మద్దతు కూడగడుతున్నారు.
హస్తం పార్టీకి పెట్టిన కోటలో ఇతర పార్టీలను దూరనిచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. ప్రత్యర్థి అధికార పార్టీ అభ్యర్థిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఏ ఒక్కరిని బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు... ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపనున్నారు. గ్రామాల వారీగా కాంగ్రెస్ మద్దతుదారులతో సమావేశమై...వారందరి సహకారంతో గెలుపును సునాయాసం చేసుకోవాలన్న యోచనతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముందుకు వెళ్లనున్నారు. పద్మావతి రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో...ఆమె గెలుపును ఎవరూ అడ్డుకోలేరని...కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇవీచూడండి: భాగ్యనగరంలో భారీవర్షం.. రోడ్లన్నీ జలమయం