Sex Ratio in Telangana: రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 988 మంది స్త్రీలు ఉన్నట్టు అర్థ గణాంక శాఖ తెలిపింది. రంగారెడ్డి జిల్లాల్లో అతి తక్కువగా ప్రతి వెయ్యిమంది పురుషులకు కేవలం 950 మంది స్త్రీలు ఉండగా... నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 1046 మంది ఉన్నట్టు స్పష్టం చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, మెదక్, కామారెడ్డి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో పురుషులతో పోలిస్తే స్త్రీలే అధికంగా ఉన్నట్టు వివరించింది.
రాష్ట్రంలో రక్తపోటు బాధితులు పెరుగుతున్నట్టు రాష్ట్ర అర్థ గణాంకశాఖ విడుదల చేసిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో బీపీ, షుగర్ బాధితులు అధికమవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో పురుషుల్లో బీపీ సమస్య 5.7 శాతం కాగా.. తెలంగాణలో మాత్రం అది 8.1గా ఉందని నివేదిక పేర్కొంది. మహిళల్లో జాతీయ స్థాయిలో 5.2 శాతం ఉండగా రాష్ట్రంలో మాత్రం 6.3 శాతం ఉన్నట్టు వివరించింది.
చిన్నారుల్లో రక్తహీనత..
షుగర్ వ్యాధి బాధితులు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నట్లు స్పష్టం చేసింది. ఇది జాతీయ సగటులో పోలిస్తే.. రాష్ట్రంలోని పురుషుల్లో 2.4 శాతం, 0.7 శాతం మంది స్త్రీలలో హైషుగర్ బాధితులు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక ఐదేళ్లలోపు చిన్నారుల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉన్నట్టు అర్థగణాంక శాఖ నివేదిక స్పష్టం చేసింది. జాతీయ సగటుతో పోలిస్తే దాదాపు 3 శాతం అధికంగా చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నట్టు వివరించింది. గర్భిణుల్లో సుమారు 58 శాతం మంది రక్తహీనత బాధితులు ఉండగా.. పురుషుల్లో కేవలం 15 శాతం మందిలో మాత్రమే రక్తహీనత ఉన్నట్లు అర్థ గణాంక శాఖ నివేదిక పేర్కొంది.
తెలంగాణలో మెరుగైన ఫలితాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిలోపు పిల్లల మరణాలు, నియోనేటల్ మోర్టాలిటీ, ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు, మెటర్నల్ మోర్టాలిటీ నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం మెరుగైన ఫలితాలు సాధించినట్టు అర్థ గణాంక శాఖ వెల్లడించింది. జాతీయ స్థాయిలో ప్రతి లక్షలో 113 మంది.. ప్రెగ్నెన్సీ సమస్యలు, కాన్పు సమయంలో మరణిస్తుండగా రాష్ట్రంలో ఆ సంఖ్య 63 మాత్రమే అని పేర్కొంది. జాతీయ స్థాయిలో ప్రతి 1000 మంది చిన్నారులకు 30 మంది పుట్టిన ఏడాదిలోపే మరణిస్తుండగా తెలంగాణలో ఆ సంఖ్య 23గా ఉన్నట్టు వివరించింది. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లోనూ జాతీయ సగటు 36 కాగా... తెలంగాణలో ప్రతి పదివేల మందికి 30 మంది పుట్టిన ఐదేళ్లలోపే చనిపోతున్నారని స్ఫష్టం చేసింది.
రాష్ట్రంలో 8.46 శాతం మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు అర్థ గణాంక శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులకు పోషకాహార పంపిణీ, బీపీ, షుగర్ వ్యాధుల నియంత్రణ చర్యలపై తీసుకోవాల్సిన అవసరాన్ని నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఇవీచూడండి: