Government Schools in Rented Buildings: రాష్ట్రవ్యాప్తంగా 156 ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే దుస్థితి. ఏటా పాఠశాల విద్యాశాఖకు రూ.10 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తున్నా ఇప్పటికీ 156 సర్కారు బడులు అరకొర వసతులతో అద్దె భవనాల్లోనే కొనసాగుతుండటం గమనార్హం. రాష్ట్రంలో 132 ప్రాథమిక, 24 ఉన్నత పాఠశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నట్లు విద్యాశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 92 ప్రాథమిక, 17 ఉన్నత పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అంటే 70 శాతం హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. మిగిలినవి వరంగల్, కరీంనగర్ తదితర నగర ప్రాంతాల్లో ఉన్నాయి. కొన్నిచోట్ల సకాలంలో అద్దె చెల్లించకపోతుండటంతో భవన యజమానులు ఖాళీ చేయాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు. తక్కువ అద్దె ఉన్నచోట్ల కొన్నిసార్లు టీచర్లే యజమానులకు సొమ్ము చెల్లించి ప్రభుత్వం మంజూరు చేశాక తీసుకుంటున్నట్లు తెలిసింది.
స్థలాలే అసలు సమస్య
సొంత భవనాలు నిర్మిద్దామని భావించినా జీహెచ్‌ఎంసీ, ఇతర నగరాల్లో జాగలు దొరకడం సమస్యగా మారింది. ప్రభుత్వ అధీనంలో స్థలాలున్నా ఆవాస ప్రాంతాలకు దూరంగా ఉంటున్నాయి. దానివల్ల పిల్లలు ట్రాఫిక్‌లో ఎక్కువ దూరం వెళ్లాల్సిన పరిస్థితి. ‘మన బస్తీ.. మన బడి’ కార్యక్రమంలో చర్చ సందర్భంగా కొందరు అధికారులు అద్దె భవనాల సమస్యను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తెచ్చారు. కలెక్టర్లు స్థలాలను ఎంపిక చేస్తే భవనాలు నిర్మిస్తామని, నిధులు మంజూరు చేస్తామని మంత్రి చెప్పినా.. విద్యార్థులుండే ఆవాస ప్రాంతంలో స్థలం దొరకడమే సమస్యగా మారింది. అన్ని వసతులున్న బడుల కోసం ప్రభుత్వం ప్రైవేటు జాగాలను కొనుగోలు చేస్తే తప్ప ఈ సమస్య తీరదని పలువురు భావిస్తున్నారు. నగరంలో స్థలాల ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తుందా? లేక అద్దె భవనాల్లోనే కొనసాగిస్తుందా? అన్నది వేచిచూడాల్సిందే.
చింతలగూడలో అద్దె భవనంలో బడి

హైదరాబాద్ చింతలగూడ(చింతలబస్తీ) పాఠశాల 50 ఏళ్ల నుంచి ఈ అద్దె భవనంలో కొనసాగుతోంది. ఇక్కడ నాలుగే గదులు ఉండటంతో ఉదయం 1-5 తరగతులకు, మధ్యాహ్నం 6-10 తరగతుల విద్యార్థులకు విద్య అందిస్తున్నారు. సొంత భవనం కోసం కొన్నేళ్ల కిందట 600 గజాల స్థలం కేటాయించి పనులు ప్రారంభించారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో నిర్మాణం ఆగిపోయింది.
గల్బాల్‌గూడలో రేకుల షెడ్డులో తరగతి నిర్వహణ

ఇది పాతబస్తీలోని గల్బాల్‌గూడ తాడ్‌బన్‌లోని ఆంగ్ల/ఉర్దూ మాధ్యమ పాఠశాల. ఇదీ అద్దె భవనమే. రేకుల షెడ్డులో విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోంది. వేసవి వచ్చిందంటే వేడిమి తట్టుకోలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ నుంచి తేరుకునేలోపే మరో దెబ్బ.. ప్రపంచార్థికానికి శాపం!