Bandi Sanjay Comments On KTR: తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత దిల్లీ మద్యం కుంభకోణం కేసులో దొరికిపోయారని అన్నారు. కేటీఆర్ కూడా మరో స్కామ్‌లో దొరికిపోతారని ఆరోపించారు. కేటీఆర్ డ్రగ్ టెస్టుకు ఇప్పుడు వెంట్రుకలు తీసుకోమంటున్నారని.. విదేశాల్లో ట్రీట్‌మెంట్ తీసుకొని వచ్చి ఇప్పుడు టెస్టుకు సిద్ధమంటున్నారని మండిపడ్డారు. వేములవాడలో నిర్వహించిన సెస్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
డ్రగ్స్ కేసుల్లో మంత్రి కేటీఆర్ దోస్తులే ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్, బెంగళూరులో డ్రగ్స్ కేసులను దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల గురించి ప్రశ్నిస్తే చెప్పుతో కొడతా అని ట్విటర్ టిల్లు అంటున్నారని విమర్శించారు. రేపు వీరిని గెలిపిస్తే నిజంగానే పేదలను కొడతారని దుయ్యబట్టారు. వేములవాడలోని డబ్బులు తీసుకుపోయి వేరే జిల్లాలో పెడుతున్నారని ఆక్షేపించారు. తాను సిరిసిల్ల వచ్చానని మంత్రులను ఇంఛార్జ్లుగా నియమించారని.. ఇది బీజేపీ గొప్పతనం అని అన్నారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి , బార్ అండ్ రెస్టారెంట్ సమితి అని ఆరోపించారు. రాష్ట్రంలోనే గతి లేదు కానీ.. దేశంలో ఏం పని చేస్తారని బండి సంజయ్ నిలదీశారు.
ఇవీ చదవండి: 'ప్రధానిపై విమర్శలు చేసేందుకే కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తుంది'
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీ ఫిక్స్.. దరఖాస్తుల స్వీకరణ అప్పటి నుంచే..