పెద్దపెల్లి జిల్లా మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న సబ్ డివిజన్ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ను డీసీపీ రవీందర్తో కలిసి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు ప్రారంభించారు. పోలీసులు క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నది పోలీస్ వ్యవస్థేనని కొనియాడారు.
కాపాడుకోవాలి..
ఆటలతో శారీరక, శ్వాస సంబంధిత వ్యాయామం జరుగుతుందని పుట్ట మధు అన్నారు. గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు ఎదిగిందని పేర్కొన్నారు. కబడ్డీ, ఖోఖో లాంటి ప్రాచీన క్రీడలు కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉందని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ వంతు సహాయం చేస్తామని తెలిపారు.
స్ఫూర్తితో..
కబడ్డీ ఎలాంటి ఖర్చు లేకుండా సరదాగా ఆడుకోవడం ప్రతి పల్లెల్లో చూస్తూ ఉంటామని డీసీపీ రవీందర్ అన్నారు. ఈ ఆటను పల్లె నుంచి సెలబ్రిటీలు ఫ్రాంచైజీలుగా జట్లు కొనుక్కునే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. ఎలాంటి భేషజాలకు పోకుండా క్రీడా స్ఫూర్తితో ఆటాడాలని సూచించారు.
అధికమవడంతో..
ప్రాచీన కాలంలో క్రీడలు జీవితంలో ఒక భాగంగా ఉండేవని.. అవి వ్యక్తి నైపుణ్యాన్ని, ప్రతిభను పెంపొందిస్తాయని మంథని సీఐ మహేందర్ అన్నారు. నేడు టీవీలు, సామాజిక మాధ్యమాలు అధికమవడంతో సమయం వాటికే కేటాయిస్తూ ఆటలపై ఆసక్తి తగ్గించుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇరు జట్ల క్రీడాకారులను ప్రోత్సహిస్తూ టాస్ వేసి ఆటను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్.. మంథని, రామగిరి ఎస్సైలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: బెల్టుషాపు తొలగించాలని ఓ కుటుంబం వినూత్న నిరసన