కొవిడ్ లక్షణాలపై అవగాహన లేమి వల్లే అనర్థాలకు దారి తీస్తోందని నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జలగం తిరుపతిరావు అన్నారు. ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు అనుమానాలు తీర్చేందుకు ఫోన్ ఇన్ కార్యక్రమం చేపట్టగా ఆయన సందేహాలను నివృత్తి చేశారు. ఉమ్మడి జిల్లాతో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ నుంచి ప్రజలు చరవాణిలో సంప్రదించి తమ సమస్యలను వివరించి సలహాలు పొందారు.
కొవిడ్ రోగులకు, లక్షణాలు ఉన్నవారికి వాడాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ వివరించారు. హోం ఐసోలేషన్‌లో పాటించాల్సిన పద్ధతులు, చిన్నపిల్లలు, గర్భిణీల విషయంలో అప్రమత్తత, వ్యాక్సిన్‌పై ఉన్న అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. గంట సేపు కొనసాగిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో దాదాపు యాభై మందికి పైగా ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకున్నారు. కరోనా లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయొద్దని వ్యాక్సిన్ విషయంలో అపోహలు వీడాలని డాక్టర్ జలగం తిరుపతిరావు సూచించారు.