ఒకప్పుడు అడవులకే పరిమితమైన కోతులు నేడు గ్రామాలు, పట్టణాల్లో సంచరిస్తున్నాయి. నిత్యం ఏదో ఒకచోట వానరాలు కరిచిన సంఘటనలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఒక కోతిని కొట్టడానికి ప్రయత్నిస్తే పదుల సంఖ్యలో కరవడానికి పరుగులు తీస్తూ వస్తాయి. రహదారి వెంట కోతులు కనిపించాయంటే చాలు వెనకకు వెళ్లిపోవాల్సిన పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల నెలకొన్నాయి. కోతుల బెడదను నివారించాలంటే అడవులను పెంచడంతో పాటు వాటి సంఖ్యను నియంత్రించడమే మార్గమని గుర్తించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలి పైలెట్ ప్రాజెక్టుగా నిర్మల్ శివారులోని గండిరామన్న హరితవనంలో కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని నెలకొల్పారు. దక్షిణాది ప్రాంతంలో ఈ తరహా కేంద్రం ఇదే కావడం విశేషం.
![State government measures to control monkeys](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9849281_kothi3.jpg)
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స
వివిధ ప్రాంతాల నుంచి పట్టుకొచ్చిన వానరాల్లో ఆడ, మగవాటిని వేర్వేరుగా ఇక్కడి బోనుల్లో బంధిస్తారు. వాటిని ఒకరోజు పరిశీలనలో ఉంచి ఏదైనా వ్యాధితో బాధ పడుతుందా, శరీరంపై గాయాలున్నాయా చూస్తారు. అనంతరం వాటికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స నిర్వహిస్తారు. మరో రెండురోజుల పాటు వాటిని పరిశీలనలో ఉంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధరణ చేసుకున్నాక తీసుకొచ్చిన ప్రాంతంలో వదిలేస్తారు. కుదరని పక్షంలో అటవీప్రాంతానికి తరలిస్తారు.
![State government measures to control monkeys](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9849281_kothi.jpg)
పది రోజుల పాటు ప్రత్యేక శిక్షణ
కేంద్రంలో పనిచేసేందుకు ప్రస్తుతం ఒక పశు వైద్యుడిని, సహాయకుడిని డిప్యూటేషన్‌పై నియమించారు. వీరికి గతంలోనే హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో ఉన్న కోతుల పునరావాస కేంద్రంలో పది రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం వీరంతా కోతులకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స పనులను ప్రయోగాత్మకంగా మొదలెట్టారు. వారం రోజుల పరిధిలో సుమారు 30 కోతులకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. తొలుత ఈ నెల 8న ఈ కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించినా వాయిదా పడింది. ఈ నెల 20న ప్రారంభించే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
![State government measures to control monkeys](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9849281_kothi2.jpg)
కేంద్రం వివరాలు స్థూలంగా..
* శంకుస్థాపన: 20 నవంబరు, 2017
* కేటాయించిన నిధులు: రూ.2.25 కోట్లు
* కేటాయించిన స్థలం: సుమారు 10 ఎకరాలు
* పనిచేసే సిబ్బంది: పశువైద్యుడు- 01, సహాయకుడు- 01, అటవీశాఖ సహాయకుడు- 01, కేంద్రం ఇన్‌ఛార్జి- 01
![State government measures to control monkeys](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9849281_doct.jpg)
లాప్రోస్కోపిక్ విధానంలో శస్త్ర చికిత్స - శ్రీకర్‌రాజు, పశువైద్యుడు
కోతుల సంఖ్య ఏటా దాదాపు రెట్టింపవుతుంది. వీటి నియంత్రణలో భాగంగా మనుషులకు కు.ని శస్త్ర చికిత్సలు చేసిన తరహాలోనే వానరాలకు మత్తుమందు ఇచ్చి లాప్రోస్కోపిక్ విధానంలో శస్త్ర చికిత్స చేస్తున్నాం. చికిత్స జరిగిన వాటిని గుర్తించడానికి వీలుగా చెవులకు రంధ్రం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ కేంద్రంలో 75 కోతుల వరకు సంరక్షించడానికి అవకాశముంది. సిబ్బంది, బోనుల సంఖ్య పెంచితే మరిన్ని ఎక్కువ కోతులను సంరక్షించడానికి వీలుంటుంది.
ఇదీ చదవండి: జనవరిలోపు పదవుల భర్తీ... ఆశల పల్లకీలో ఆశావహులు!