నిర్మల్ పాలనాధికారి ముషారఫ్ అలీ ఫారూఖీ మంచి క్రీడాకారుడు. రోజువారీ కార్యక్రమాల్లో క్షణం తీరికలేకుండా గడిపే ఉద్యోగమయినా.. క్రమం తప్పకుండా ఉదయం నడకతో పాటు.. సాయంత్రం టెన్నిస్ ఆడతారు. ఇది కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి స్ఫూర్తిదాయకమైన దైనందిన చర్యనే. అయితే.. స్ఫూర్తి పొందటం పక్కన పెట్టి.. ఆయన ఆడుతుంటే.. బాల్స్ అందించేందుకు సేవకులుగా మారటమే కొంచెం ఇబ్బంది కల్గించే అంశం. వాళ్లను అలా మారేందుకు హుకూం జారీ చేయటం.. మరి జుగుప్స కలిగించే విషయం. అచ్చం అలాంటి ఘటనే జరుగుతోంది నిర్మల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో..!!
ఠంచనుగా రావాలని హుకూం..: తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ సాయంత్రం ఆడే ఆటకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలనుకున్నారో ఏమో.. ఏకంగా 18 మంది వీఆర్‌ఏలకు ప్రత్యేక విధులు కేటాయిచారు నిర్మల్ అర్బన్ తహసీల్ధార్ శివప్రసాద్. వీరి పర్యవేక్షణ కోసం మరో ఏడుగురు వీఆర్‌వోలను నియమిస్తూ సోమవారం(ఏప్రిల్ 11న) డీ-777-202 నెంబర్‌తో ప్రత్యేక ప్రోసిడింగ్ తీశారు. అక్కడితో ఆగకుండా.. విధులు కేటాయించిన సిబ్బంది రోజూ సాయంత్రం ఠంచనుగా 5 గంటల 30 నిమిషాలకు.. తహసీల్ధార్ కార్యాలయంలోని టెన్నీస్ కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు. పైగా వారి హాజరుపట్టికను పరిశీలించాలని మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు రాతపూర్వకంగా హుకూం జారీచేశారు.
బాల్స్ అందించడానికే..: కలెక్టర్ అధికారిక తనిఖీల్లో భాగంగా రోజూ ఒకే కార్యాలయాన్ని సందర్శించరు. సందర్శించకూడదు. తన వ్యక్తిగత అభిరుచిలో భాగంగానే టెన్నిస్ ఆడటానికి తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నారనేది సుస్పష్టం. అయితే.. కలెక్టర్ సందర్శించే సమయంలో కిందిస్థాయి ఉద్యోగులకు విధులు కేటాయించారంటే ఒప్పుకోవచ్చు. అలా కాకుండా.. రోజుకు కొంతమంది చొప్పున వారం రోజుల టైంటేబుల్ వేసి.. 18 మంది వీఆర్‌ఏలు, పర్యవేక్షణ కోసం మరో 7 వీఆర్‌వోలకు విధులు కేటాయించారంటే.. ముమ్మాటికీ కలెక్టర్ టెన్నిస్ ఆడేటప్పుడు బాల్ అందించడం కోసమేనని రూఢీ అవుతోంది.
ఉన్నతాధికారుల మెప్పుకోసం కిందిస్థాయి ఉద్యోగులు తాపత్రయపడటం సహజమైన ప్రక్రియనే. కానీ.. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారన్న కారణంతో.. వీఆర్‌ఏలు, వీఆర్‌వోలకు విధులు కేటాయించడం, దానికోసం ప్రత్యేకంగా ప్రొసీడింగ్ జారీచేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి: