అచ్చంపేటలో భాజపా జాతీయప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్ పాల్గొన్న ర్యాలీపై జరిగిన దాడిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అనేందుకు అచ్చంపేట దాడే నిదర్శనమని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తాము ఓడిపోతున్నామని తెలిసి తెరాస నేతలు అసహనానికి గురవుతున్నారని ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తెరాసకు కొమ్ముకాయడం సరికాదన్నారు. తెరాస ఒత్తిడితో పోలీసులు భాజపా కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని పోలీసులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. వచ్చేది భాజపా సర్కార్ అనే విషయం పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. పోలీసుల దాడిలో భాజపా కార్యకర్తలు గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారన్నారు. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం: తెరాస-భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ, లాఠీ ఛార్జ్
ఇదీ చూడండి : 'ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన సీఎం కేసీఆర్'