గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇంతా అంతా కాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రధాన ప్రాంతాల్లో అయితే గంటల వరకు ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన దుస్థితి. ఇలాంటి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎస్ఆర్డీపీలో (Strategic Road Development Plan) భాగంగా జంట నగరాల్లో పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తోంది. దాంతో పాటు ఇటూ లింక్ రోడ్లను నిర్మించి ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ తగ్గిస్తోంది. ఇప్పటికే ఇందులో చాలా వరకు నిర్మాణాలు పూర్తై ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
ఇవాళ్టి నుంచి బాలానగర్ ఫ్లైఓవర్ వినియోగంలోకి రానుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ పైవంతెనను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి పాల్గొననున్నారు.
బాలానగర్ ట్రాఫిక్ దాటితే చాలు..
బాలానగర్ డివిజన్‌లోని నర్సాపూర్ చౌరస్తా... రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలి. కూకట్‌పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల వెళ్లే రహదారి పారిశ్రామిక కేంద్రం కావటంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. బాలానగర్‌లో ట్రాఫిక్ దాటితే చాలు అని వాహనదారులు అనుకోని రోజు ఉండదు. ఇక్కడ కష్టాలు అలాంటివి మరి. ఇలాంటి ట్రాఫిక్ అవస్థలకు చెక్ పెట్టేందుకు ఈ పైవంతెనను నిర్మించారు.
రూ.385 కోట్ల వ్యయంతో నిర్మాణం..
2017 ఆగస్టు 21న బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 385 కోట్లతో మూడున్నరేళ్ల వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేశారు. వంతెనకు ఇరువైపులా రెండు డివిజన్లు ఉన్నాయి. ఒకటి ఫతేనగర్, మరొకటి బాలానగర్. రెండు డివిజన్లతో వందలాది పరిశ్రమలు ఉన్నాయి . దీంతో నిత్యం కార్మికులు, లారీలు, ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది.
ఇదే ప్రత్యేకత..
ఈ పైవంతెన పొడవు 1.13 కిలోమీటర్లు. వెడల్పు 24 మీటర్లు. 26 పిల్లర్లతో ఈ వంతెనను నిర్మించారు. ఈ పైవంతెనకు ఓ ప్రత్యేకత ఉంది. హైదరాబాద్‌లో 6 లేన్లతో నిర్మించిన మొట్టమొదటి ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఇది. దీనికి బాబు జగ్జీవన్ రామ్ బ్రిడ్జిగా నామకరణం చేయనున్నారు.
ఇదీచూడండి: BALANAGAR FLYOVER: ఈ నెల 6న ప్రారంభం కానున్న బాలానగర్ ఫ్లైఓవర్