A Man Met his Family Members After 15 Years in Medak District : మెదక్ జిల్లాకు చెందిన చెన్నయ్య అనే వ్యక్తి పదిహేనేళ్ల క్రితం కుటుంబంలో వచ్చిన గొడవల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులపై కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన చెన్నయ్య.. ఊరూరూ తిరుగుతూ చివరకు మహారాష్ట్రకు చేరుకున్నాడు. అతడి కోసం కుటుంబం అన్ని చోట్లా వెతికారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అయితే 2017లో చెన్నయ్య మహారాష్ట్రలోని సంగమ్నేర్ తాలుకాలోని సకూర్ గ్రామానికి వెళ్లాడు.
అప్పటి నుంచి చెన్నయ్య ఆ గ్రామంలోనే ఉంటున్నాడు. అక్కడ శ్మశాన వాటిక, బస్టాండ్, బీరోబా మహరాజ్ మందిర్.. ఇలా కనిపించిన ప్రాంతంలో తలదాచుకునే వాడు. కుటుంబం గురించిన చింత కానీ.. రేపటి గురించిన బాధ కానీ చెన్నయ్యకు ఉండేది కాదని గ్రామస్థులు చెబుతున్నారు. ఆ గ్రామంలోనే ప్లాస్టిక్ వస్తువులు, చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చాడు. అయితే అక్కడి స్థానికులు ఎక్కడి నుంచి వచ్చావు అని చెన్నయ్యను అడిగితే సమాధానం చెప్పేవాడు కాదు.
ఈ క్రమంలోనే ఆ గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి చెన్నయ్య గురించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తన కుటుంబానికి తెలిస్తే వచ్చి అతడిని తీసుకువెళ్తారన్న ఆశతో తరచూ చెన్నయ్యకు సంబంధించిన విషయాలు పోస్టు చేస్తూ ఉండేవాడు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా.. అతడికి సంబంధించి ఎవరూ రాకపోవడంతో ఇటీవల కర్ణాటకలోని అహ్మద్‌నగర్‌కు వెళ్లిన అశోక్.. అక్కడ సామాజిక కార్యకర్త, స్నేహ మనోయాత్రి పునర్వాస కేంద్రం హెడ్ రమాకాంత్ హరిదాస్‌ను కలిశాడు. ఈ సందర్భంగా చెన్నయ్య గురించి రమాకాంత్‌కు చెప్పాడు.
విషయం తెలిసుకున్న రమాకాంత్.. తన బృందంతో సాకుర్ గ్రామానికి వెళ్లి చెన్నయ్యను తీసుకువెళ్లారు. మొదట్లో అహ్మద్‌నగర్‌లోనే చెన్నయ్యకు చికిత్స అందించింది. అయితే చెన్నయ్య తన గురించి ఏం చెప్పకపోవడం.. కాస్త వింతగా ప్రవర్తించడంతో మానసికంగా బాధపడుతున్నాడని ఆ కేంద్రం నిర్వాహకులు భావించారు. ఈ క్రమంలోనే ఓ మానసిక నిపుణుడికి ఆయనను చూపించారు.
ఆ తర్వాత వైద్యులు చెన్నయ్యకు చికిత్స చేయడం ప్రారంభించగా.. నెమ్మదిగా తన పేరు, ఊరు అన్ని విషయాలు గుర్తుకు రావడం ప్రారంభమైంది. అలా చెన్నయ్య గురించి అన్ని విషయాలు తెలుసుకున్న ఆ నిర్వాహకులు.. తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఉన్న తన కుటుంబానికి చెన్నయ్యను అప్పగించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన చెన్నయ్యను చూసి ఆ కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లేడు.. ఇక రాడు అనుకున్న వ్యక్తి.. చాలా కాలం తర్వాత తిరిగి రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.