కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని చింతకర్రవాగు.. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తుండగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిషన్‌నాయక్ తండాకు చెందిన ఓ గర్భిణీ పురిటి నొప్పులతో వాగు దాటేందుకు దాదాపు రెండు గంటలపాటు నరకయాతన అనుభవించింది. వాగు ఇరువైపులా దాదాపు మూడు కి.మీ నడిచి.. గ్రామస్థుల సాయంతో రెండు గంటల తర్వాత వాగు దాటింది. ప్రస్తుతం జైనూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
దశాబ్దాలు గడుస్తున్నా ఏ ప్రభుత్వాలు.. తమను పట్టించుకోవట్లేదని.. ఓట్ల కోసం మాత్రమే తమ వద్దకు వస్తున్నారంటూ గ్రామస్థులు పేర్కొన్నారు. ఇప్పటికీ తన గ్రామానికి కనీసం అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదని.. వర్షాకాలం వస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోందని వాపోయారు.
వంతెన లేక వాగు ఉప్పొంగితే బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయన్నారు. గ్రామానికి వెళ్లే దారి కూడా ఇబ్బందికరంగా మారుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి.. తమ గ్రామాలకు వంతెనతో పాటు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః భర్త కోసం నీళ్ల ట్యాంక్ ఎక్కి గర్భిణీ నిరసన