మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ వేర్వేరుగా పర్యటించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, కలెక్టర్ శశాంకతో కలిసి కరీంనగర్ జిల్లా కమలాపూర్‌తోపాటు జమ్మికుంట మండలాల్లో పర్యటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షం కురిసినందువల్ల చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని, పంటలు నీటి మునిగిపోయాయని మంత్రి అన్నారు.
నగునూరుతోపాటు జూబ్లీనగర్ ప్రాంతాల్లో కలెక్టర్ శశాంకతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. జిల్లాలో మొత్తం 1,367 చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. ముందస్తు చర్యలు తీసుకున్నందున... ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 18వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని మంత్రి తెలిపారు. ఆయా నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.