కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామ శివారులో బరిగేల యాదయ్య అనే రైతు యాసంగిలో రెండున్నర ఎకరాల్లో వరి పంటను సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక ఇప్పటికే ఎకరం వరి పంట ఎండిపోయింది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంటను సాగు చేయగా... కళ్లెదుటే పంట ఎండిపోతుండడం వల్ల మనస్తాపానికి గురైన రైతు యాదయ్య పంటకు నిప్పు పెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు. పశువులకు మేతగానైనా ఉపయోగపడుతుందని చుట్టుపక్కల రైతులు అడ్డుకొని నిప్పును ఆర్పివేశారు.
పంటను కాపాడుకోవడానికి రెండు బోర్లు కూడా వేశానని... అయినా బోర్లలో నీళ్లు పడక రెండు లక్షల వరకు అప్పు అయ్యిందని యాదయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని లేకుంటే పంటకు నిప్పు పెట్టినట్లు ఇక తానే నిప్పు పెట్టుకొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు.
ఇదీ చదవండి: దిగుబడి పెరిగినా కొనే నాథుడు లేక మక్క రైతుల ఆందోళన