జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణ కేంద్రంలోని దుర్గానగర్ కాలనీలో గద్వాల అడిషనల్ ఎస్పీ కృష్ణ, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ అపూర్వ రావు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు గద్వాల డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వాహనాలపై అవగాహన లేని మైనర్ బాలలకు వాహనాలు ఇవ్వకూడదని గ్రామస్థులకు సూచించారు. వాహన తనిఖీల్లో మైనర్లు పట్టుబడితే వారి తల్లిదండ్రులపై, వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అడిషనల్ ఎస్పీ కృష్ణ తెలిపారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తనిఖీల్లో 75 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.