జనగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు రానున్న 8 నెలలలో మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా సాగు నీరందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.350 కోట్లను మంజూరు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌ను కలవగా ఈ విషయాన్ని చెప్పారని ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి పేర్కొన్నారు.
ఆరు నెలలుగా ప్రయత్నాలు
మల్లన్నసాగర్ నీటి విడుదలకు ఆరు నెలలుగా సీఎం వద్ద ప్రయత్నాలు చేసినట్లు ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి చెప్పారు. ఇప్పుడు బచ్చన్నపేట, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలకు పూర్తి స్థాయిలో మల్లన్నసాగర్ నుంచి సాగు నీటిని అందించేందుకు మంత్రి హరీశ్‌రావు, సాగునీటి ఇంజినీర్ ఇన్ చీఫ్ రవీందర్‌రావును సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు.
రూ.350 కోట్లు ప్రతిపాదనలు సిద్ధం
ఇప్పటికే దీని కోసం రూ.350 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి తెలిపారు. మల్లన్నసాగర్ నుంచి 5 టీఎంసీల నీటిని తీసుకునేందుకు ప్రణాళిక రూపొందించారన్నారు. గజ్వేల్ సమీపంలోని చిన్నకిష్టాపురంలో పంప్‌హౌస్ నిర్మాణం చేపట్టి, అక్కడి నుంచి కాలువ ద్వారా తపాసుపల్లికి సాగునీరు చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి తెరాస శ్రేణులతో కలిసి పుష్పాభిషేకం నిర్వహించారు.
ఇదీ చూడండి: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: ఈటల